ప్రస్తుత వరంగల్ జిల్లా మూడు ముక్కలు కానుంది. జిల్లాలో ఇప్పుడు 51 మండలాలు ఉండగా, అధికారులు రూపొందించిన ప్రతిపాదనల ప్రకారం ఇందులో ఏడు మండలాలు సిద్ధిపేట, యూదాద్రి జిల్లాల్లోకి వెళ్తున్నారుు. వరంగల్ జిల్లాలో కరీంనగర్ నుంచి ఆరు మండలాలు కలువనున్నారుు. ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా(భూపాలపల్లి)లో కరీంనగర్ నుంచి ఏడు, ఖమ్మం జిల్లా నుంచి రెండు మండలాలు, మానుకోట జిల్లాలో ఖమ్మం నుంచి మూడు మండలాలు కలువనున్నారుు.
వరంగల్: జిల్లాల పునర్విభజన కొలిక్కి వస్తోంది. ప్రస్తుత వరంగల్ జిల్లాను మూడు జిల్లాలుగా మార్చేందుకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భూపాలపల్లి, మహబూబాబాద్‌లో పరిపాలన సౌకర్యాల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. మూడు జిల్లాల అవసరాలకు తగినట్లుగా ఉద్యోగులు, సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు.
మండలాల వారీగా మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు, ప్రణాళిక శాఖలు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నాయి. కలెక్టర్ కార్యాలయం సమన్వయంతో జిల్లాల పునర్విభజన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ప్రస్తుత వరంగల్ జిల్లాను.. వరంగల్, మానుకోట, ప్రొఫెసర్ జయశంకర్ జిల్లాలుగా ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించారు. మండలాల ప్రాతిపదికగా పునర్విభజనకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం సెలవులో ఉన్న కలెక్టర్ వాకాటి కరుణ మంగళవారం నుంచి విధులకు హాజరుకానున్నారు.
అప్పుడు జిల్లాల పునర్విభజన ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు రూపొందించే ప్రతిపాదన కోసం ప్రజాభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకుని సమాచారం ఇవ్వాలని మండలాల అధికారులకు జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మండలాల ప్రాతిపదికగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రజాభిప్రాయం, రాజకీయ పార్టీలతో సమావేశం వంటి ప్రక్రియల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. తాజా ప్రతిపాదనల ప్రకారం మూడు జిల్లాల స్వరూపం ఇలా ఉండనుంది.
వరంగల్ జిల్లాలో ప్రస్తుతం 51 మండలాలు ఉన్నాయి. జిల్లా కేంద్రానికి దూరంగా ఉండే చేర్యాల, మద్దూరు, బచ్చన్నపేట, నర్మెట మండలాలను కొత్తగా ఏర్పడే సిద్ధిపేట జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఈ అంశంపై నాలుగు మండలాల వారికి సానుకూలత ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉన్న జనగామ, లింగాల ఘణపురం, దేవరుప్పుల మండలాలను కొత్తగా ఏర్పడనున్న యాదాద్రి(భువనగిరి) జిల్లాలో కలిపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. లింగాలఘనపురం, దేవరుప్పులలో ఈ ప్రతిపాదనపై సానుకూలత ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు జనగామలో విభిన్న పరిస్థితి నెలకొంది. జనగామ మండలాన్ని యాదాద్రి జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
జనగామ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఉద్యమం కొనసాగుతోంది. ప్రతి రోజు ఆందోళన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ఈ అంశంలో అధికారులు ఇంకా స్పష్టతకు రాలేదని తెలిసింది. ప్రతిపాదిత జిల్లాల్లో కలిపే ఖమ్మం జిల్లాలోని పలు మండలాలపైనా పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, ఇల్లందు మండలాలను భద్రాద్రి(కొత్తగూడెం) జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు రూపొందించారు. అరుుతే వాజేడు, వెంకటాపురం మండలాలు కొత్తగూడెం కంటే దగ్గరగా ఉండే ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా(భూపాలపల్లి)లో కలిపేలా మరో ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నారు. ఇల్లందు మండలాన్ని భద్రాద్రి(కొత్తగూడెం) జిల్లాలో కలపాలనే ప్రతిపాదన ఉంది. అరుుతే కొత్తగూడెం కంటే దగ్గరగా ఉండే మానకోట(మహబూబాబాద్)లో కలిపేందుకు తాజా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని తెలిసింది.