కొక్రాఝర్: పట్టణానికి ఎనిమిది కిలోమీటర్లు దూరంలోని బాలాజన్ టినాలి మార్కెట్ పై జరిగిన ఉగ్రదాడిలో 13 మంది పౌరులు మృతి చెందగా, గాయలపాలైన వారి సంఖ్య 18కు పెరిగింది. దాడిపై స్పందించిన ప్రభుత్వం మరిన్ని దళాలను ఘటనాస్థలానికి హుటాహుటిన పంపింది. కాగా దాడిని అసోం సీఎం సర్బానంద సోనోవాల్ తీవ్రంగా ఖండించారు. ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఫోన్ లో మాట్లాడారు.
ఉగ్రదాడిలో మృతి చెందిన పౌరులకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించారు. మొత్తం ముగ్గురు మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారని డిఫెన్స్ పీఆర్వో లెఫ్టినెంట్ కల్నల్ ఎస్ న్యూటన్ చెప్పారు. ఒక మిలిటెంటును భద్రతాదళాలు హతమార్చినట్లు ప్రకటించారు. మిగిలిన ఇద్దరి కోసం భద్రతాదళాలు గాలిస్తున్నట్లు తెలిపారు.
స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రంలో హైఅలర్ట్ ఉన్న సమయంలో దాడి జరగడం మరింత ఆందోళనను కలిగిస్తోంది. దాడిపై స్పందించిన అసోం డీజీపీ సహాయ్ నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్(ఎన్డీఎఫ్ బీ) కు మిలిటెంట్లు దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నట్లు చెప్పారు. కొక్రాఝర్ మిలిటెంట్ల దాడి దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అసోం ప్రభుత్వం నుంచి దాడిపై పూర్తి వివరాలు తెలుసుకుంటామని చెప్పారు. బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.