
ఆక్సిజన్ అందక 18 మంది మృతి
చెన్నై: భారీ వర్షాలు చెన్నైలో 18 మంది రోగుల ప్రాణాలు బలిగొన్నాయి. కరెంట్ లేకపోవడంతో ఐసీయూలో ఆక్సిజన్ అందక రోగులు మృతి చెందారు. మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆర్ధోపెడిక్స్ అండ్ ట్రామటాలజీ(ఎంఐటీ) ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. భారీవర్షాలు, వరదలు కారణంగా ఆస్పత్రిలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. గంటల తరబడి విద్యుత్ లేకపోవడంతో వెంటిలేటర్లు పనిచేయకపోవడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న 75 మందిలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. కరెంట్ లేకపోవడం, ఆక్సిజన్ సిలెండర్లు అయిపోవడంతో రోగులు మృతి చెందినట్టు తెలుస్తోంది.
18 మంది రోగులు మృతి చెందినట్టు తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ ధ్రువీకరించారు. ఎంఐటీ ఆస్పత్రిలో 570 మందికి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఇక్కడి నుంచి 57 మందిని వివిధ ఆస్పత్రులకు తలించినట్టు చెప్పారు. ఆరోగ్యశాఖ మంత్రితో కలిసి ఆయన ఎంఐటీ ఆస్పత్రిని సందర్శించారు. రోగుల మరణానికి కారణాలు తెలియరాలేదని, దర్యాప్తుకు ఆదేశించామని రాధాకృష్ణన్ పేర్కొన్నారు.