
వరద ఉధృతిలో మానవహారం కట్టి..!
చెన్నై గుండె చెరువైంది. ఎటుచూసినా నీళ్లు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు. నగరం నిండా కన్నీళ్లు, కడగండ్లు నింపింది. వానలు సృష్టిస్తున్న బీభత్సంతో నగరమంతా అతలాకుతలమవుతున్న వేళ చెన్నై వాసి మొక్కవోని గుండె ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. వరద ఉధృతిలో చిక్కుకున్న ఓ వ్యక్తిని చెన్నైవాసులు సాహసోపేతంగా కాపాడారు. ఐదారుగురు వ్యక్తులు మానవహరం కట్టి.. వరద ఉధృతిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి యుట్యూబ్‌లో పెట్టారు. వరద ఉధృతిలో పూర్తిగా చిక్కుకున్న వ్యక్తిని వారు మానవహరంగా ఏర్పడి.. చాకచక్యంగా కాపాడారు.
ఇక చెన్నైలో భారీగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాగునీరు, నిత్యావసరాల వస్తువులు అందుబాటులో లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. మొబైల్, ఇంటర్నెట్ సేవలు కూడా ఆగిపోయాయి.