
చెన్నై - నెల్లూరు.. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రయాణం
''ఎప్పుడో మంగళవారం మధ్యాహ్నం తిన్న భోజనం.. ఆ తర్వాత తిండి అన్నదే లేదు. రోజు మొత్తం కరెంటు ఉండేది కాదు.. రాత్రిపూట రెండు గంటలు ఇవ్వడంతో కష్టమ్మీద సెల్‌ఫోన్లు చార్జింగ్ పెట్టుకున్నాం. కానీ మాట్లాడాలన్నా, వాట్సప్.. ఫేస్‌బుక్‌లో షేర్ చేద్దామన్నా సిగ్నళ్లు లేవు. నానా తిప్పలు పడి గురువారం రాత్రి 9.30కి నెల్లూరు చేరుకున్న తర్వాత మళ్లీ తిండి మొహం చూడగలిగాం''
.... ఇదీ చెన్నైలో యాక్సెంచర్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కార్తీక్, క్యాప్ జెమినిలో పనిచేస్తున్న వాళ్ల బంధువు చైతన్యల ప్రత్యక్ష అనుభవం.
నెల్లూరుకు చెందిన వీరిద్దరూ బంధువులే కావడంతో కారపాక్కం అనే ప్రాంతంలో ఒక రూం అద్దెకు తీసుకుని అక్కడ ఉంటున్నారు. చెన్నై నగరంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు వాళ్ల పరిస్థితిని నరకప్రాయం చేశాయి. ఈ విషయాలను వాళ్లు 'సాక్షి వెబ్‌సైట్'తో ప్రత్యేకంగా పంచుకున్నారు. వాళ్లు చెప్పిన విషయాలు వాళ్ల మాటల్లోనే...
''మంగళవారం ఉదయం నుంచే కరెంటు లేదు. రాత్రి ఒక రెండు గంటలు ఇచ్చాడు. ఇప్పటికీ మా స్నేహితులు వేల్చారి ప్రాంతంలో ఇరుక్కుపోయి ఉన్నారు. చుట్టూ నడుం లోతు నీళ్లు. రెస్క్యూ బోట్లు కూడా ఒకటీ అరా మాత్రమే తిరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం తర్వాత తిండి మొహం చూడలేదు. ఇక గురువారం మధ్యాహ్నానికి ఎలాగైనా నెల్లూరు బయల్దేరి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం. తీరా చూస్తే జేబులో డబ్బులు కొంచెమే ఉన్నాయి. మామూలుగా అయితే వెళ్లచ్చు గానీ, ఆటోలు, బస్సుల టికెట్లు ఎక్కువగా ఉంటే ఎలాగో అర్థం కాలేదు. బయట ఏటీఎం సెంటర్లు ఏవీ పనిచేయడం లేదు. కరెంటు లేదు కదా.. అన్నీ అవుటాఫ్ ఆర్డర్. అకౌంట్లలో జీతం పడినా, అందులోంచి రూపాయి కూడా తీసుకునేందుకు వీలు పడలేదు. అయినా తప్పదు. మేం చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు గానీ, కోయంబేడు బస్టాండుకు గానీ వెళ్లాలి. కారపాక్కం నుంచి బస్సులు ఆటోలు ఏవీ నడవడం లేదు. దాంతో ఓ లారీ దొరికితే దాని వెనకాల ఎక్కి, తిరువనమ్మియార్ వరకు వెళ్లాం. అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర లైన్లో దాదాపు 300 మందికి పైనే ఉన్నారు.
చెన్నై నుంచి చాలామంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఇలా బయల్దేరుతున్నారు..
ఎంక్వైరీలో అడిగితే చెన్నై సెంట్రల్ నుంచి రైళ్లేవీ లేవని చెప్పారు. ఇక బస్సు ఎక్కి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు. సో ఆ స్టేషన్ బయట షేర్ ఆటో ఎక్కి గిండి చేరుకున్నాం. అక్కడి నుంచి కోయంబేడుకు బస్సులు ఏవీ లేకపోవడంతో పక్కనే ఉన్న అల్లుందూర్‌కి నడిచి వెళ్లి మెట్రో ఎక్కాం. అందులో జనం రద్దీ అంతా ఇంతా కాదు.. ఒకటే తొక్కేసుకుంటున్నారు. ఎలాగో కోయంబేడులో దిగాం. అక్కడ జనాల రద్దీ బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల క్యూలైనును గుర్తు చేసింది. ఆ జనాల్ని తోసుకుంటూ ఏపీఎస్ ఆర్టీసీ వాళ్లు ఏర్పాటుచేసిన స్పెషల్ పల్లెవెలుగు బస్సు ఎక్కి నెల్లూరు చేరుకున్నాం. సాధారణంగా చెన్నై నుంచి నెల్లూరుకు 3-4 గంటల ప్రయాణం కానీ, మేం వచ్చింది మాత్రం రాత్రి 9.30 గంటలకి. రాగానే స్నానం చేసి.. అన్నం మొహం చూస్తే.. అప్పుడు అన్నం విలువ ఏంటో తెలిసింది''