ఏడు దేశాలు. రెండు వేల మందికిపైగా పారిశ్రామికవేత్తలు. అందరిదీ ఒకే సంకల్పం.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏడు దేశాలు. రెండు వేల మందికిపైగా పారిశ్రామికవేత్తలు. అందరిదీ ఒకే సంకల్పం. కొత్త ఆలోచనలు (ఐడియా) మొదలుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగడం. నూతన ఆలోచనలు, విస్తరణ, పెట్టుబడి, వ్యాపార అవకాశాలు. ఇవే వారి లక్ష్యాలు. లక్ష్య సాధనకు ఇప్పుడు ఒకే వేదికపైకి రానున్నారు. ద ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్(టై) ఆధ్వర్యంలో ఇక్కడి హెచ్‌ఐసీసీలో డిసెంబర్ 18 నుంచి 20 వరకు టై ఎంట్రప్రెన్యూరియల్ సమ్మిట్-2013 జరగనుంది. ఆసియాలో అతి పెద్దదైన ఈ సదస్సుకు తొలిసారి హైదరాబాద్ వేదికవుతోంది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్, మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్, నాసా వ్యోమగామి బెర్నార్డ్ ఆంటోని హ్యారిస్ జూనియర్ తదితరులు కార్యక్రమానికి రానున్నారు. మొత్తం 5,000 మంది సదస్సుకు హాజరవుతారని సదస్సు కో-చైర్ జె.ఏ.చౌదరి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.