గాలిలో ఢీకొనబోయిన ఇండిగో విమానాలు !
గువాహటి: ఇండిగోకు చెందిన రెండు విమానాలు ఆకాశంలో దాదాపు ఢీకొనే పరిస్థితిని ఎదుర్కొన్నాయి. గువాహటిలో ఒకదానికొకటి ఎదురుగా వచ్చిన ఈ విమానాలు వెంటుక్రవాసిలో ఢీకొనేముప్పును తప్పించుకున్నాయి. అయినప్పటికీ ఒకదానికొకటి రాపిడి చేసుకోవడంతో రెండు విమానాల్లోని ప్రయాణికులు బెదిరిపోయారు. దాదాపు నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. వారికి వెంటనే వైద్య సహాయం అందించినట్టు అధికారులు తెలిపారు.
గగనతలంలో సంభవించిన ఈ ఊహించిన ప్రమాదంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో రెండు విమానాల్లోని ప్రయాణికులు తమ కళ్లు తిరిగి.. అస్వస్థతకు గురైనట్టు అనిపించిందని ఫిర్యాదు చేశారని, క్యాబిన్ సిబ్బందికి వెంటనే వైద్య సహాయం అందించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
గువాహటి లోకప్రియ గోపీనాథ్ బర్దోలై అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ముంబై నుంచి గువాహటికి ఇండిగో విమానం వస్తుండగా.. అదే సమయంలో చెన్నై వెళ్లే మరో ఇండిగో విమానం టేకాప్ తీసుకుంది. రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చాయి. అయితే, వాతావరణం బాగాలేకపోవడంతో గువాహటి వస్తున్న ఇండిగో విమానం రూట్ మార్చుకుందని, దీనివల్ల రెండు ఎదురెదురుపడ్డాయని అధికారులు తెలిపారు.