
సస్పెన్స్ థ్రిల్లర్.. బీజేపీకి షాక్
- తనదికాని మూడో స్థానం కోసం పోరి ఖంగుతిన్నబీజేపీ
- కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ విజయం
- రాత్రంతా హైడ్రామా.. 6గంటలు ఆలస్యంగా కౌంటింగ్
- హస్తం పార్టీకి కలిసొచ్చిన ఈసీ నిర్ణయం
- అమిత్‌షాకు షాకిచ్చిన బీజేపీ రెబల్!
మొత్తం స్థానాలు: 3
పోలైన ఓట్లు: 176, చెల్లని ఓట్లు: 2
మొదటి స్థానంలో స్మృతి ఇరానీకి: 45 (మొదటి ప్రాధాన్య ఓటుతోనే గెలుపు)
రెండో స్థానంలో అమిత్ షాకు: 46(మొదటి ప్రాధ్యాన్య ఓటుతో గెలుపు)
మూడో స్థానంలో అహ్మద్ పటేల్‌కు: 44 (మొదటి ప్రాధాన్య ఓటుతో గెలుపు)
ఓడిన అభ్యర్థి బల్వంత్ సిన్హ్ రాజ్‌పుత్‌కు: 39 (బీజేపీ 31+ 7కాంగ్రెస్ రెబల్ ఓట్లు)
అహ్మదాబాద్: గుజరాత్ రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్ ఆద్యంతం సస్సెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. బుధవారం తెల్లవారుజామున 2గంలకు తుదిఫలితాలు వెల్లడయ్యాయి. అధికార బీజేపీ నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలు సునాయాసంగా గెలుపొందగా, మూడో స్థానం కోసం జరిగిన పోటీలో కాషాయదళం ఖంగుతిన్నది. సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి, కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ 44 ఓట్లు సాధించి ఐదోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. పటేల్ గెలుపులో మలుపులివి..
సంచలనం రేపిన వీడియో: అహ్మద్ పటేల్‌ను ఎలాగైనాసరే దెబ్బకొట్టాలనుకున్న బీజేపీ.. శంకర్ సింన్హ్ వాఘేలా నేతృత్వంలోని ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తనవైపునకు తిప్పుకుంది. అనుకున్న ప్రకారమే వారంతా బీజేపీకి ఓటేశారు. కానీ అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు.. బ్యాలెట్ పత్రాలను బీజేపీ ఏజెంట్‌కు చూపించారు. ఆ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ ఫుటేజి కాస్తా రట్టుకావడం సంచలనంగా మారింది. దీంతో ఆ ఇద్దరి ఓట్లను రద్దుచేయాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు ఈసీని ఆశ్రయించారు.
ఆరు గంటలు ఆలస్యంగా కౌంటింగ్: కాంగ్రెస్ రెబల్స్ బీజేపీకి ఓటేసిన వీడియోను ఎన్నికల కమిషన్ పరిశీలిస్తున్న సమయంలోనే.. బీజేపీ నేతలు సైతం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. సమగ్ర పరిశీలన అనంతరం.. బ్యాలెట్ పేపర్‌ను చూపించిన ఇద్దరు కాంగ్రెస్ రెబల్స్ ఓట్లు చెల్లవని ఈసీ తేల్చిచెప్పింది. ఈ కారణంగా కౌంటింగ్ ప్రక్రియ సుమారు ఆరు గంటలు ఆలస్యంగా మొదలైంది.
మ్యాజిక్ ఫిగర్ 45 నుంచి 44కు కుదింపు: ఓటేసిన 176 మందిలో ఇద్దరి ఓట్లు చెల్లకుండా పోవడంతో అభ్యర్థుల గెలుపు కోసం అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 45 నుంచి 44కు తగ్గింది. ఆ రకంగా ఈసీ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసొచ్చింది.
పటేల్‌కు ఓటేయని కాంగ్రెస్ ఎమ్మెల్యే: పోలింగ్ మొదలయ్యే సమయానికి చీలక వర్గం ఓట్లు పోను, కాంగ్రస్‌కు 44 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. కానీ వారిలో 43 మంది మాత్రమే అహ్మద్ పటేల్‌కు ఓటేశారు! గెలుపు కోసం అవసరమైన ఆ ఒక్క ఓటు ఎవరు వేశారనేదానిపై భిన్నవాదనలు నడుస్తున్నాయి.
అమిత్ షాకు షాకిచ్చిన బీజేపీ రెబల్?: అహ్మద్ పటేల్‌ను ఓడించే దిశగా పలు వ్యూహాలు రచించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే నితిన్‌భాయ్ పటేల్ షాకిచ్చినట్లు తెలుస్తోంది. నితిన్.. కాంగ్రెస్ అభ్యర్థి పటేల్‌కు ఓటు వేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ, కాంగ్రెస్ మాత్రం తమకు దక్కిన ఆ ఒక్క ఓటు.. జేడీయూ ఎమ్మెల్యే ఛోటుభాయ్ వాసవ లేదా ఎన్సీపీ ఎమ్మెల్యేదో లేక గుజరాత్ పరివర్తన్ పార్టీ(జీపీపీ) ఎమ్మెల్యేదో అయి ఉంటుందని భావిస్తోంది.
పొలిటికల్ టెర్రరిజం: ఉత్కంఠ పోరులో విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ ఎంపీ అహ్మద్ పటేల్ బీజేపీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీది రాజకీయ ఉగ్రవాదమని, అర్ధ,అంగబలంతో గెలవాలని ప్రయత్నించిందని ఆరోపించారు. చివరికి సత్యమే గెలుస్తుందని ట్వీట్ చేశారు. తనకు ఓటేసిన ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు.