ఆ బ్యాంకు కస్టమర్లకు కొత్త డెబిట్ కార్డులు
పుణే : ఆరు లక్షలకు పైగా డెబిట్ కార్డులను బ్లాక్ చేస్తూ కస్టమర్లకు షాకిచ్చిన దేశీయ అగ్రశ్రేణి బ్యాంకు ఎస్బీఐ, వారికి కొత్త కార్డులను జారీచేస్తోంది. ఇటీవలే హితాచీ పేమెంట్స్ సర్వీసెస్లో మాల్వేర్ ఇనెక్షన్ వల్ల దాదాపు 32 లక్షల డెబిట్ కార్డుల తస్కరణకు గురైన సంగతి తెలిసిందే. ఈ భారీ సైబర్ దాడిలో ఆరు లక్షల ఎస్బీఐ ఖాతాదారుల సమాచారం ప్రభావితమైందని తెలిసింది. దీంతో ఎస్బీఐ ఆ కస్టమర్ల కార్డులను బ్లాక్ చేసింది. బ్లాక్ చేసిన 6.29 లక్షల కార్డులను రీప్లేస్మెంట్లో కొత్త కార్డులను మంజూరు చేస్తున్నట్టు ఎస్బీఐ తెలిపింది. భారతీయ బ్యాంకింగ్ చరిత్రలో ఇదే అతిపెద్ద రీప్లేస్మెంట్.
95.5 శాతం కార్డులను అక్టోబర్ 26న మంజూరు చేశామని, మిగతావారి కాంటాక్ట్ సమాచారం రాబట్టే ప్రయత్నంలో ఉన్నామని బ్యాంకు తెలిపింది. ఇప్పటి వరకూ వారు సంబంధిత బ్రాంచ్ల వద్ద సమాచారం అప్డేట్ చేయించుకోలేదని ఎస్బీఐ కార్పొరేట్ స్ట్రాటజీ, న్యూ బిజినెస్ డిప్యూటీ ఎండీ మంజు అగర్వాల్ చెప్పారు. ఆ కస్టమర్లు కూడా బ్రాంచ్లను వద్ద సంప్రదించి, కొత్త కార్డులను తీసుకెళ్లాలని పేర్కొన్నారు. మొత్తం 19 వివిధ బ్యాంకులపై ఈ సైబర్ అటాక్ జరిగింది. ఈ దాడిలో 32 లక్షల డెబిట్ కార్డుల సమాచారం తస్కరణకు గురైంది.