హజ్ యాత్రలో పెను విషాదం | 717 dead in stampede outside Mecca | Sakshi
Sakshi News home page

హజ్ యాత్రలో పెను విషాదం

Published Fri, Sep 25 2015 12:56 AM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM

గురువారం సౌదీ అరేబియాలోని మినా వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చెల్లాచెదురుగా ఉన్న మృతదేహలు

గురువారం సౌదీ అరేబియాలోని మినా వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చెల్లాచెదురుగా ఉన్న మృతదేహలు

మినాలో తొక్కిసలాట.. 717 మంది మృతి
863 మందికి గాయాలు.. మృతుల్లో ఒక హైదరాబాద్ మహిళ సహా నలుగురు భారతీయులు

మినా: సౌదీ అరేబియాలో కొనసాగుతున్న హజ్ యాత్రలో గురువారం పెను విషాదం చోటు చేసుకుంది. మినాలో జరిగిన ఘోర తొక్కిసలాటలో 717 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 863 మంది గాయపడ్డారు. మృతుల్లో.. నలుగురు భారతీయులు, 90 మంది ఇరాన్ పౌరులు సహా వివిధ దేశాలకు చెందిన హజ్ యాత్రికులు ఉన్నారు. తొక్కిసలాటకు కారణమేమిటనేది నిర్దిష్టంగా తెలియరాలేదు.

అయితే.. మినాలో జమారత్ వద్ద ‘సైతానును రాళ్లతో కొట్టేందుకు’ భారీ సంఖ్యలో యాత్రికులు తోసుకోవటంతో ఈ తొక్కిసలాట సంభవించిందని.. జమారత్‌కు వెళ్లే దారిలో రెండు రోడ్ల కూడలి వద్ద ఈ దుర్ఘటన జరిగిందని ప్రభుత్వ సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం మతస్తులు ఏటా పాల్గొనే హజ్ యాత్రలో తరచుగా తొక్కిసలాటల వంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. అయితే.. గురువారం నాటి దుర్ఘటన గత 25 సంవత్సరాల్లో రెండో పెద్ద దారుణం.

ఈ ఏడాది హజ్ యాత్ర ఆరంభంలోనే.. రెండు వారాల కిందటే ఈ నెల 11వ తేదీన మక్కాలో ప్రధాన మసీదు వద్ద భారీ క్రేన్ కూలి 11 మంది భారతీయులు సహా 115 మంది హజ్ యాత్రికులు చనిపోయిన విషయం తెలిసిందే. ఆ విషాదం నుంచి తేరుకోకముందే మరో భారీ ఘోరం సంభవించటం ప్రపంచాన్ని విచారంలో ముంచింది. మక్కాకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోని మినాలో.. భారత కాలమానం ప్రకారం ఉదయం 11:30 గంటల సమయంలో ఈ తొక్కిసలాట జరిగింది.
 
యాత్ర చివరి ఘట్టంలో ఘోరం: ఈ ఏడాది హజ్ యాత్ర మంగళవారం మొదలైంది. భారతదేశం నుంచి దాదాపు లక్షన్నర మంది సహా 20 లక్షల మందికి పైగా యాత్రికులు ఈ ఏడాది హజ్‌లో పాల్గొంటున్నారు. యాత్రికులు రెండు రోజుల కిందట మక్కా నుంచి హజ్ యాత్ర కోసం శిబిరాల నగరమైన మినాకు వచ్చారు. అక్కడ వారు రాత్రి పూట విశ్రమించేందుకు దాదాపు 1.60 లక్షల శిబిరాలను ఏర్పాటు చేశారు. దీనినిబట్టే యాత్రికుల వెల్లువ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మహమ్మద్ ప్రవక్త దాదాపు 1400 సంవత్సరాల కిందట తుది హజ్ ధర్మోపదేశం ఇచ్చిన చోటు అయిన అరాఫాలో యాత్రికులు బుధవారం ప్రార్థనలు నిర్వహించి.. సైతానును రాళ్లతో కొట్టే కార్యక్రమంలో పాల్గొనేందుకు మళ్లీ మినాకు తిరిగివచ్చారు. హజ్ యాత్రలో ముఖ్యమైన ఘట్టాల్లో ఇదే చివరి ఘట్టం. జమారాత్ వంతెనగా పేర్కొనే ఐదంతస్తుల కట్టడం వద్ద ఈ మతవిశ్వాస ఆచారం పాటించటం జరుగుతోంది.

ఇక్కడ సైతానుకు సంకేతంగా మూడు స్తూపాలు ఉంటాయి. కిలోమీటరు నిడివి ఉండే ఈ కట్టడం నుంచి గంటలో 3 లక్షల మంది ఆచారాన్ని పాటించేందుకు వీలు ఉంటుంది. రాళ్లు విసిరిన తర్వాత.. ప్రవక్త ఇబ్రహీం తన ఏకైక కుమారుడు ఇస్మాయిల్‌ను దేవునికి బలిచ్చేందుకు సంసిద్ధతను తెలిపే ఘటన కు స్మారకంగా యాత్రికులు జంతు బలి ఆచారాన్ని పాటిస్తారు. బలి విందు ఈద్-అల్-అదా అనంతరం యాత్ర ముగుస్తుంది.
 
నిమిషాల్లోనే వందల మంది మృతి: ఈద్-అల్-అదా తొలి రోజు అయిన గురువారం నాడే మినాలో భారీ తొక్కిసలాట సంభవించింది. వేల సంఖ్యలో ఉన్న యాత్రికుల మధ్య ఒక్కసారిగా తోపులాటతో వందలాది మంది కిందపడిపోయారు. పెను విషాద ఘటన చోటుచేసుకోగానే సౌదీ భద్రతా సిబ్బంది, సహాయకులు నిమిషాల్లో రంగంలోకి దిగారు. కానీ అప్పటికే వందల మంది చనిపోయారు.

ఘటనా స్థలంలో మృతదేహాలు కుప్పలుగా పడివుండగా.. గాయపడ్డవారు ఆ మృతదేహాల మధ్యనే కూలబడి కనిపించారు. మృతుల బంధువులు, గాయపడిన మహిళలు, వృద్ధులు ఆర్తనాదాలు చేస్తున్నారు. నాలుగు వేల మందికి పైగా సహాయక సిబ్బంది, 220 అంబులెన్స్‌ల్లో గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించారు.
 
కారణాలపై భిన్న కథనాలు: ఆఫ్రికా దేశాలకు చెందిన కొందరు యాత్రికుల వల్లే తొక్కిసలాట జరిగిందని సెంట్రల్ హజ్ కమిటీ అధిపతి ప్రిన్స్ ఖాలిద్ అల్-ఫైసల్ ఆరోపించినట్లు సౌదీ ప్రభుత్వానికి చెందిన అల్ అరేబియా టీవీ పేర్కొంది. అయితే.. జమారత్ స్తూపాల వద్దకు వెళ్లే రెండు మార్గాలను సౌదీ అధికారులు ఎందుకో మూసివేశారని.. దీంతో లక్షలాదిగా వస్తున్న యాత్రికులు ఒక్కచోట నిలిచిపోయి తొక్కిసలాట జరిగిందని.. ఇరాన్ హజ్ సంస్థ అధినేత సయ్యద్ ఒహాది ఐఆర్‌ఎన్‌ఏ వార్తా సంస్థతో పేర్కొన్నారు.

తొక్కిసలాట సరిగ్గా ఎక్కడ జరిగిందనే అంశంపైనా భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. హజ్ ఆచారాల్లో భాగంగా ‘సైతానును రాళ్లతో కొట్టే’ ప్రాంతం వద్ద రద్దీలో ఈ తొక్కిసలాట జరిగిందని సౌదీ సర్కారు పేర్కొంటే.. తొక్కిసలాట జరిగింది అక్కడ కాదని.. యాత్రికుల శిబిరాల మధ్య 204 నంబరు మార్గంలో జరిగి యాత్రికులు చనిపోయారని అల్‌జజీరా టీవీ ప్రతినిధి చెప్పారు. తొక్కిసలాటపై దర్యాప్తునకు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ నయేఫ్ ఆదేశించారు.
 
ప్రణబ్, మోదీ సహా ప్రముఖుల సంతాపాలు.. హజ్ యాత్రలో భారీ తొక్కిసలాటలో వందలాది మంది యాత్రికులు చనిపోవటం పట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీలు గురువారం వేర్వేరు ప్రకటనల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.  కాగా పవిత్ర హజ్ యాత్ర సందర్భంగా మక్కాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
 
భారత్ నిరంతర పర్యవేక్షణ.. ఈ తొక్కిసలాటలో నలుగురు భారతీయులు చనిపోయినట్లు జెడ్డాలోని భారత దౌత్యకార్యాలయం పేర్కొంది. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ, ఒక వాలంటీర్, కేరళకు చెందిన ఒక వ్యక్తి ఉన్నారని తెలిపింది. భారతీయ హజ్ కార్యక్రమ వైద్యులను మినా, మక్కాల్లోని అన్ని ఆస్పత్రులకూ పంపించామని.. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఒక ప్రకటనలో వివరించింది. మరోవైపు తెలంగాణ హజ్ కమిటీ ఆధ్వర్యంలో బయలుదేరిన యాత్రికులు మినా ఘటనలో గాయపడినట్లు సమాచారం లేదని కమిటీ ప్రత్యేక అధికారి ఎస్‌ఎ షుకూర్ వెల్లడించారు.
 
హజ్ యాత్రికుల కోసం హెల్ప్‌లైన్లు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం మక్కా దుర్ఘటనకు సంబంధించి సచివాలయంలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. 040-23214125కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్‌తోపాటు రాష్ట్ర హజ్ కమిటీ ఎప్పటికప్పుడు అక్కడి వివరాలను సేకరిస్తున్నారు. అటు హజ్‌హౌస్‌లోనూ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు.

తెలంగాణ యాత్రికులకు 040-23214193, ఏపీ యాత్రికులకు 040-23298793 నెంబర్ల ను కేటాయించారు. అదేవిధంగా కేంద్ర హజ్ కమిటీ 022-22717100/101/102 నంబర్లతో, సౌదీ లోని భారత దౌత్యకార్యాలయం భారతదేశం నుంచి ఫోన్ చేసే వారి కోసం 00966125458000, 00966125496000 నంబర్లతో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. అలాగే సౌదీ నుంచి ఫోన్ చేసే భారతీయ యాత్రికుల కోసం 8002477786 నంబరుతో టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
 
ఎల్‌బీనగర్ వాసి మృతి
హైదరాబాద్: మక్కాలో జరిగిన తోక్కిసలాటలో హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ నివాసి బీబీజాన్ (62)అనే మహిళ మృతి చెందా రు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన షేక్ మజీద్, ఆయన భార్య బీబీజాన్ 25 ఏళ్ల కిందట ఎల్‌బీనగర్‌కు నివాసం వచ్చారు. ఆయన తన భార్య బీబీజాన్, బీహెచ్‌ఇఎల్‌లో నివసిస్తున్న తన సోదరుడు షేక్ రవూఫ్, అతని భార్య షహనాజ్‌లు కలిసి ఈ నెల 2న హజ్ యాత్రకు వెళ్లారు. గురువారం ఉదయం మినాలో సైతాన్‌పై రాళ్లు వేసే కార్యక్రమం జరుగుతున్నప్పుడు జరిగిన తొక్కిసలాటలో బీబీజాన్ మృతిచెందారు. ఆమె మృతి వార్తను మజీద్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు
 
గతంలో జరిగిన ప్రమాదాలు
జూలై 2, 1990: మక్కా నుంచి మీనాకు వెళ్లే దారిలో పాదచారుల సొరంగ మార్గంలో తొక్కిసలాట. 1,426 మంది మృతి. వీరిలో ఎక్కువ మంది మలేసియా, ఇండోనేషియా, పాకిస్తాన్ పౌరులున్నారు.
మే 23, 1994: సైతాన్‌పై రాళ్లు విసిరే ఆచారంలో తొక్కిసలాట. 270 మంది మృతి.
ఏప్రిల్ 9, 1998: జమారత్ వంతెనపై ప్రమాదం 118 మంది మృతి
మార్చి 5, 2001: సైతాన్‌పై రాళ్లు విసిరే ఆచారంలో తొక్కిసలాట. 35 మంది మృతి.
ఫిబ్రవరి 11, 2003: సైతాన్‌పై రాళ్లు విసిరే ఆచారంలో తొక్కిసలాట. 14 మంది మృతి.
ఫిబ్రవరి 1, 2004: సైతాన్‌పై రాళ్లు విసిరే ఆచారంలో తొక్కిసలాట. 251 మంది మృతి.
జనవరి 12, 2006: హజ్ చివరి రోజున సైతాన్‌పై రాళ్లు విసిరే ఆచారంలో తొక్కిసలాట. 346 మంది మృతి
సెప్టెంబర్ 11, 2015: క్రేన్ కుప్పకూలి 111 మంది మృతి. 394మందికి గాయాలు.
సెప్టెంబర్ 24, 2015: జమారత్ వంతెనపై తొక్కిసలాట. 717 మంది మృతి. 500 మందికి గాయాలు.హజ్ యాత్ర అంటే.. ముస్లింల పుణ్యక్షేత్రమైన మక్కా నగరానికి తీర్థయాత్ర చేయటం.. ఇస్లాంలో ముఖ్యంగా అయిదు ఆచరణీయ అంశాలను మూలస్తంభాలుగా విశ్వసిస్తారు. మత విశ్వాసము, నిత్య ప్రార్థనలు, దయ, రంజాన్ మాస ఉపవాసము, జీవితంలో ఒకసారి మక్కా యాత్ర అన్నవి ఇస్లాంలో ప్రతి ఒక్కరు ప్రధానంగా ఆచరించాల్సిన అంశాలు. హజ్ యాత్ర(మక్కా తీర్థయాత్ర) ఇందులో అయిదవది. షియాలు, సున్నీలు అంతా ఆచరించే అంశాలు ఇవి. ఇందులో హజ్ యాత్ర చాలా ముఖ్యమైంది.

ఇస్లాం కేలండర్‌లోని 12వ నెల జుల్ హిజా(బక్రీద్ నెల)లో హజ్ యాత్ర చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది ముస్లింలు ఈ యాత్రలో పాల్గొంటారు. ఈ యాత్రను ముస్లింలు చాలా నిష్టగా చేయాల్సి ఉంటుంది. ఈ యాత్ర చేసేందుకు అనేక ఆంక్షలను కూడా ఇస్లాం విధించింది. అప్పులు ఉన్న వాళ్లు కానీ, వడ్డీలు, దానధర్మాల ద్వారా వచ్చిన డబ్బులతో కానీ, కుటుంబ బాధ్యతలను పూర్తిగా తీర్చని వాళ్లు, పెళ్లి కాని కూతుళ్లు ఉన్న వాళ్లు, అనారోగ్యంతో ఉన్న వాళ్లు హజ్ యాత్ర చేయటానికి అనర్హులని ఇస్లాం చెప్తోంది. హజ్ యాత్ర చేయటంలో మక్కాకు చేరుకున్న తరువాత పాటించాల్సిన పద్ధతులు కూడా కఠినంగానే ఉంటాయి.
 
హజ్ యాత్రలో ప్రధానంగా పాటించే ఆచారాలు
 1. ఉమ్రా(యాత్ర) చేసేందుకు ఇహ్రాం చేరుకోవాలి.
 2.  కాబా చుట్టూ అపసవ్య దిశలో ఏడు ప్రదక్షిణలు(తవాఫ్ అల్ ఉమ్రా) చేయాలి
 3. సఫా, మార్వా కొండల మధ్య 7 సార్లు ప్రయాణించాలి
 4. క్షవరం చేయించుకోవటం ద్వారా ఉమ్రాను పూర్తి చేయాలి
 5. జుల్‌హిజా మాసం 8వ రోజున హజ్ నిర్వహించటానికి ఇహ్రాం చేరుకోవాలి
 6. మక్కాకు అయిదు కిలోమీటర్ల దూరంలోని మీనా  చేరుకుని అక్కడ కేటాయించిన టెంట్‌లో ఒక పగలు, ఒక రాత్రి విశ్రాంతి తీసుకోవాలి.
 7. 9వరోజున అరాఫా ఎడారి మైదాన ప్రాంతంలో మధ్యాహ్న వేళ ప్రార్థనలు చేయాలి.
 8. 9వ రోజు రాత్రి ముజ్ద్ అలీఫా చేరుకుని అవసరమైన రాళ్లను సేకరించుకోవాలి. అక్కడి ఇసుక తిన్నెలపై రాత్రి నిద్రపోవాలి
 9. 10వ రోజు ఉదయం తిరిగి మీనాలోని శిబిరానికి చేరుకోవాలి.
 10. పవిత్రమైన త్యాగం నిర్వహించాలి(జంతుబలి)
 11. మరోసారి క్షవరం చేసుకోవాలి.
 12. తరువాత తవాఫ్ అల్ జియారా (ప్రదక్షిణ) నిర్వహించి తిరిగి మీనాలోని శిబిరానికి చేరుకోవాలి
 13. 11వ రోజున మూడు జమారత్‌ల దగ్గర రాళ్లు విసిరి, మీనాలోని శిబిరానికి చేరుకోవాలి
 14. 12వ రోజున మూడు జమారత్‌ల దగ్గర రాళ్లు విసిరి సూర్యాస్తమయం కాకముందే మీనా శిబిరాన్ని విడిచి వెళ్లిపోవాలి
 15. మక్కాను విడిచి వెళ్లే ముందు తవాఫ్ అల్‌వదా నిర్వహించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement