మీరు ఇంటర్నెట్ ఎంతవరకు ఉపయోగిస్తారు? గట్టిగా మాట్లాడితే భారతదేశంలో ఎంతమంది రోజూ ఉపయోగిస్తున్నారు.. అది కూడా ఆన్లైన్ షాపింగ్ కోసం ఏమాత్రం ఉపయోగపడుతోంది? మన దేశం మాటేమిటో గానీ, ఇంగ్లండ్లో మాత్రం ఏకంగా 73 శాతం మంది తమకు కావల్సిన వాటన్నింటినీ కేవలం ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నారట. ఈ విషయం అక్కడి ప్రభుత్వం వెల్లడించిన వివరాల్లో తేలింది. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటస్టిక్స్ (ఓఎన్ఎస్) లెక్కల ప్రకారం, బ్రిటన్లో ప్రస్తుతం 3.6 కోట్ల మంది పెద్దలు లేదా, మొత్తం జనాభాలో దాదాపు 73 శాతం మంది ప్రతిరోజూ ఇంటర్నెట్ ఉపయోగస్తున్నారు. 2006 సంవత్సరంలో కేవలం 2 కోట్ల మందే ఉపయోగించగా, ఇప్పుడీ సంఖ్య గణనీయంగా పెరిగిందన్నమాట.
2.1 కోట్ల కుటుంబాలు లేదా మొత్తం కుటుంబాల్లో 83 శాతం వాటికి ఇంట్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. ప్రజల రోజువారీ జీవన విధానాన్ని ఇంటర్నెట్ శరవేగంగా మార్చేసిందని ఓఎన్ఎస్ తెలిపింది. పెద్దల్లో మూడింట రెండొంతుల మంది ఇంటర్నెట్ వాడుతుండగా, ప్రతి పదిమందిలో ఆరుగురు మొబైల్ఫోన్ లేదా పోర్టబుల్ కంప్యూటర్లను ఇంటర్నెట్ కోసం ఉపయోగిస్తున్నారట.
అయితే, బ్రిటన్లోని దాదాపు 40 లక్షల కుటుంబాలు లేదా.. మొత్తం కుటుంబాల్లో 17 శాతం మందికి ఇప్పటికీ అసలు ఇంటర్నెట్ సౌకర్యమే లేదు. ఇక నెట్ వాడకంలో వివరాలు చూస్తే, దాదాపు సగం మందికి పైగా వార్తా పత్రికలు చదవడానికి లేదా డౌన్లోడ్ చేయడానికే ఉపయోగిస్తున్నారు. దీంతో వార్తా పత్రికలు కొని చదవడం బాగా తగ్గిపోయింది. సోషల్ నెట్వర్కింగ్ కూడా ఇటీవలి కాలంలో బాగా పెరిగిందని ఓఎన్ఎస్ చెప్పింది. తమకు ఇంట్లో కావల్సిన వస్తువులు కొనుగోలు చేయడానికి 72 శాతం మంది ఆన్లైన్ స్టోర్స్ మీదే ఆధారపడుతున్నారు. 2008లో ఈ సంఖ్య 53 శాతం మాత్రమే. బ్రిటిష్ మహిళల్లో సగం మంది తమ దుస్తులను కూడా ఆన్లైన్లోనే కొంటున్నారు.
బ్రిటన్లో 73 శాతం కొనుగోళ్లు ఆన్లైన్లోనే
Published Fri, Aug 9 2013 9:51 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
Advertisement
Advertisement