
కారు బాంబు పేలుడు : 120 మంది మృతి!
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని ఖాన్ బని సాద్ ప్రాంతంలో మార్కెట్ వద్ద శుక్రవారం రాత్రి భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 120 మంది మరణించినట్లు తెలుస్తోంది. బాంబు పేలుడు ఘటనలో గాయపడిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండవచ్చని భద్రత దళాలు వెల్లడించాయి. క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని... దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భద్రత దళాలు పేర్కొన్నాయి.
ఈ బాంబు పేలుడు దాటికి సమీపంలోని వాహనాలు, షాపులు అగ్నికి ఆహుతయ్యాయని చెప్పారు. బాంబు పేలుడుతో ఖాన్ బని సాద్ ప్రాంతమంతా ఒక్కసారిగా భీతావహంగా మారిందని చెప్పారు. రంజాన్ పండగ సమీపించడంతో మార్కెట్ ప్రాంతమంతా జనాలతో నిండి ఉందని తెలిపారు. మార్కెట్లోని ట్రక్లో బాంబు పేలుడు సంభవించినట్లు చెప్పారు.