ఫేస్బుక్ వ్యాఖ్యలపై అమీర్ఖాన్ ఫిర్యాదు
సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యాఖ్యలు పెట్టారంటూ బాలీవుడ్ నటుడు అమీర్ఖాన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వ్యాఖ్యలు తప్పువని, నిరాధారమని ఆయన అన్నాడు. ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మిత్రా, జాయింట్ కమిషనర్ సదానంద్ దాటేలను అమీర్ కలిశాడు. క్రైం బ్యూరోలోని సైబర్ సెల్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. గతంలో ఆడ పిల్లల భ్రూణహత్యలు, గృహహింస తదితర అంశాలపై అమీర్ నిర్వహించిన సత్యమేవ జయతే కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. దాంతో ఆయన ఈనెల 2వ తేదీన సత్యమేవ జయతే రెండో భాగం ప్రారంభించాడు.
ఈసారి తొలి ఎపిసోడ్లో అత్యాచారాలు, రెండో ఎపిసోడ్లో పోలీసు కానిస్టేబుళ్ల గురించి తీసుకున్నాడు. చివర్లో.. హ్యుమానిటీ ట్రస్టుకు విరాళాలవ్వాలని అమీర్ కోరుతాడని, అయితే.. ఆ డబ్బు ఓ వర్గ ప్రయోజనాలకే ఉపయోగపడుతుందని ఫేస్బుక్లో వ్యాఖ్యలు వచ్చాయి. అయితే అక్కడ చెప్పిన ట్రస్టుకు, తాను చెబుతున్న ట్రస్టుకు సంబంధం లేదని ఫేస్బుక్ ద్వారానే అమీర్ స్పష్టం చేశాడు. వాట్స్ యాప్, ఫేస్బుక్, ట్విటర్, ఇతర సోషల్ మీడియా ద్వారా ఇలాంటి సందేశాలు విపరీతంగా జనంలోకి వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఆరోపణలు పూర్తిగా తప్పని చెప్పాడు. తమ ట్రస్టు నిరుపేదలకు ఉచిత వైద్యసాయం అందించడంలో అద్భుతమైన సేవలు చేస్తోందన్నాడు.