
అసభ్య ప్రవర్తన.. పోలీసుల కస్టడీలో నటుడు!
పాలక్కడ్: ఏకంగా పాఠశాల ఆవరణలోనే విద్యార్థినులతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడం కేరళలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో మలయాళ సీనియర్ నటుడు శ్రీజిత్ రవిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. కారులో ఉన్న ఓ వ్యక్తి నగ్నంగా తమవైపు చూస్తూ వెకిలి హావభావాలకు పాల్పడ్డాడని, తమ ఫొటోలను తీసుకున్నాడని కొందరు విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పథిరిపాలెంలోని ఓ ప్రముఖ పాఠశాలలో ఈ ఘటన జరిగింది.
ఆ వ్యక్తి ఉన్న కారు నంబర్‌ను పోలీసులకు అందజేశారు. ఆ కారు ఎవరిదని ఆరాతీస్తే.. అది ప్రముఖ నటుడు శ్రీజిత్ రవిదని తేలింది. దీంతో ఆయనను కస్టడీలోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించారు. అయితే, తాను స్కూలు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్టు వచ్చిన ఆరోపణలను శ్రీజిత్ రవి కొట్టిపారేశారు. విద్యార్థినులు ఇచ్చిన కారు నంబర్ తనదేనని, అయితే తాను ఎవరితో అసభ్యంగా ప్రవర్తించలేదని తెలిపారు. విద్యార్థినులు కారు నంబర్ సరిగ్గా నోట్ చేసుకొని ఉండరని, తప్పుగా వారు తన వాహనం నంబర్ ఇచ్చి ఉంటారని, అంతేకానీ తాను ఎలాంటి తప్పుడు చర్యలకు పాల్పడే వ్యక్తి కాదని ఆయన వివరణ ఇచ్చారు.