అంకితభావం అలవర్చుకోవాలి: నరసింహన్
సాక్షి, హైదరాబాద్: బాధితులలో ధైర్యాన్ని నింపి వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని కొత్త డీఎస్పీలకు గవర్నర్ నరసింహన్ సూచించారు. అంకి త భావం, పారదర్శకత అలవరచుకోవాలని కోరా రు. 9వ బ్యాచ్‌కు చెందిన 59 మంది డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ బుధవారం ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ (అప్పా)లో జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజానికి సవాల్‌గా మారిన ఆర్థిక నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బ్యాంకులకు సంబంధించిన నేరాలను శిక్షణలో తొలిసారిగా భాగస్వామ్యం చేయడాన్ని గవర్నర్ ప్రశంసించారు.
పోలీసుల పనితీరును ప్రజలు నిత్యం గమనిస్తున్నారని డీజీపీ ప్రసాదరావు అన్నారు. గడచిన ఏడాది కాలంలో వెయ్యి మంది ఎస్‌ఐలకు శిక్షణ ఇచ్చామని అప్పా డెరైక్టర్ మాలకొండయ్య తెలిపారు. అప్పాలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ తొలి పోలీసు కమిషనర్ రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి విగ్రహాన్ని గవర్నర్ నరసింహన్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కాగా, శిక్షణ కాలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు డీఎస్పీలకు గవర్నర్ ట్రోఫీలు అందించారు. క్రిమినాలజీలో డాక్టర్ జి.ప్రేమ్ కాజల్, ఫైరింగ్‌లో జి.చక్రవర్తి, అవుట్ డోర్ విభాగంలో జి.వెంకటరాముడు ట్రోఫీలు అందుకున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన శ్రావణి పలు ట్రోఫీలతో పాటు సీఎం రివాల్వర్ ట్రోఫీని కూడా సొంతం చేసుకున్నారు. కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, మాజీ డీజీపీలు పాల్గొన్నారు.