
పాస్‌పోర్టు కోసం తిరిగి వచ్చిన విమానం
తన పాస్‌పోర్టు కన్పించడం లేదంటూ ఓ బాలుడు చేసిన హంగామా చివరకు విమానం ల్యాండింగ్‌కు దారి తీసింది.
తన పాస్‌పోర్టు కనిపించడం లేదంటూ ఓ పిల్లాడు చేసిన హంగామా చివరకు విమానాన్ని వెనక్కి తిప్పింది. మీనంబాక్కం విమానాశ్రయం నుంచి దుబాయ్లోని ఓ ప్రైవేటు సంస్థకు చెందిన విమానం ఆదివారం రాత్రి పది గంటలకు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన తర్వాత ఓ 15 ఏళ్ల పిల్లాడు తన పాస్‌పోర్టును విమానాశ్రయం కౌంటర్‌లో మరచిపోయనట్లు పైలట్‌కు చెప్పాడు. తాను దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లాల్సి ఉందన్నాడు.
దాంతో పైకి వెళ్లిన 25 నిమిషాలకే విమానం మళ్లీ ల్యాండింగ్ కోరుతూ పైలట్ కంట్రోల్ రూంకు సమాచారం పంపించారు. వారు అనుమతించారు. విమానం వెనక్కి వచ్చి విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే, తనవద్ద ఉన్న మరో బ్యాగ్‌లో పాస్‌పోర్టు ఉండడాన్ని ఆ పిల్లాడు గుర్తించాడు. అతడి చర్యలకు విస్తుపోయిన విమాన సిబ్బంది అతడి చేత తోటి ప్రయాణికులకు క్షమాపణ చెప్పించారు. అయితే ఆ బాలుడు ఎక్కడి నుంచి చెన్నైకు వచ్చాడో, అమెరికాలో ఏం చేస్తాడో అనే వివరాలు మాత్రం అధికారులు వెల్లడించలేదు. బాలుడితో బంధువు ఒకరు ఉన్నట్లు మాత్రం చెప్పారు.