అక్టోబర్ 12న లండన్ లో సమైక్యవాదుల ధర్నా!
అక్టోబర్ 12న లండన్ లో సమైక్యవాదుల ధర్నా!
Published Wed, Oct 9 2013 12:06 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూకే విభాగం నిరసన కార్యక్రమాన్ని చేపట్టనుంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ 70 రోజులకు పైగా సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఆందోళన, నిరసన కార్యక్రమాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సీమాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు సమైక్యంగా కష్టించి.. రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో గుర్తింపు లభించేలా చేశారు. రాష్ట్రానికి సంబంధించిన మొత్తం ఆదాయంలో 80 శాతానికి పైగా ఆదాయం రాష్ట్ర రాజధాని వస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవ పరిస్థితులను బేరిజు వేసుకోకుండా తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధాని పీఠం ఎక్కించడానికి సోనియాగాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి సిద్ధపడటంతో సీమాంధ్రలోని అనేక ప్రాంతాల్లో చేపట్టిన సమ్మె కారణంగా పలు రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయనే ఆవేదన ఎన్నారైల్లో కూడా వ్యక్తమవుతోంది.
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లండన్ లోని భారతీయ హై కమీషన్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యాక్రమాన్ని నిర్వహించేందుకు లండన్ మెట్రోపాలిటన్ పోలీసుల నుంచి అనుమతి కూడా తీసుకున్నామని శ్రీకాంత్ లింగాల, వైఎల్ఎన్ రెడ్డి, రాజుల ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 12 తేది శనివారం 1.30 నిమిషాల నుంచి 5 గంటల వరకు జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున యూకే, యూరప్ లోని సమైక్యవాదులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరింత సమాచారం కోసం 07540 222344, 07885971115, 07429 300528 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.
Advertisement
Advertisement