శశికళ వర్గానికి షాక్‌.. | AIADMK shocked with RK Nagar bypoll cancellation | Sakshi
Sakshi News home page

శశికళ వర్గానికి షాక్‌..

Published Mon, Apr 10 2017 8:21 AM | Last Updated on Thu, Aug 30 2018 6:07 PM

శశికళ వర్గానికి షాక్‌.. - Sakshi

శశికళ వర్గానికి షాక్‌..

చెన్నై: తమిళనాడులోని ఆర్కేనగర్‌ శాసనసభ స్థానానికి ఈ నెల 12న జరగాల్సిన ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేయడంతో అధికార అన్నాడీఎంకే వర్గం షాక్‌కు గురైంది. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నికలో గెలిచి.. ఎలాగైనా పట్టు నిరూపించుకోవాలని అన్నాడీఎంకే శశికళ వర్గం తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి వరకు కూడా ఆర్కే నగర్‌లో అన్నాడీఎంకే నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఇంతలో ఈసీ ప్రకటించిన ఉప ఎన్నిక నిర్ణయం ఆ పార్టీని ఇరకాటంలో పడేసింది. ఉప ఎన్నికను రద్దు చేయడం ద్వారా ఈసీ చరిత్రాత్మక తప్పిదానికి పాల్పడిందంటూ అన్నాడీఎంకే అభ్యర్థి, శశికళ కొడుకు దినకరన్‌ మండిపడ్డారు. కాగా, అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప ఈసీ నిర్ణయాన్ని స్వాగతించారు. ’ఈ ఎన్నిక పారదర్శకంగా జరగడం లేదని గుర్తించి ఈసీ జోక్యం చేసుకుంది. దేశంలో రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం బతికే ఉందనడానికి,  భారత్‌ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనడానికి ఇది నిదర్శనం’ అని ఆమె కొనియాడారు.

రాజకీయంగా అత్యంత కీలకంగా మారిన ఈ ఉప ఎన్నిక కోసం రూ. 89 కోట్ల మేరకు ఓటర్లకు శశికళ వర్గం పంచిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఆదివారం కీలక భేటీ నిర్వహించిన ఈసీ.. ఉప ఎన్నికను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్‌ స్థానానికి ఏప్రిల్‌ 12న ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంచారు. ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో ఈ పంపకాల వ్యవహారం గుట్టురట్టైంది. ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌, నటుడు శరత్‌ కుమార్‌, ఇంకొందరికి చెందిన 32 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుపగా రూ.90 కోట్ల వరకు నగదును ఓటర్లకు సరఫరా చేసినట్లు వెల్లడైంది. దీంతో ఇంకా వెలుగులోకిరాని పంపకాలు భారీ స్థాయిలోనే జరిగి ఉంటాయని ఐటీ శాఖ భావించింది.
 
విచ్చలవిడిగా సాగుతోన్న ధనప్రవాహంపై  ఐటీ శాఖ ఎన్నికల సంఘానికి ఒక రిపోర్టు పంపింది. సమగ్ర పరిశీలన అనంతరం ఈసీ ఉప ఎన్నికను రద్దుచేస్తున్నట్లు నిర్ణయాన్ని ప్రకటించింది. తాజాగా ఆర్కే నగర్‌లో చోటుచేసుకున్నట్లే గత ఏడాది తంజావురు, అరవకురిచి నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ విచ్చలవిడి ధనప్రవాహాన్ని గుర్తించిన ఈసీ.. ఆయా ఎన్నికలను వాయిదావేసిన సంగతి తెలిసిందే.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement