ట్రిపుల్ తలాఖ్‌పై ఆత్మపరిశీలన చేసుకోవాలి
వివాదాస్పద ట్రిపుల్ తలాక్ అంశంపై అలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) వైఖరిపై సీపీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రిపుల్ తలాఖ్ యథాతథంగా కొనసాగుతుందని, కానీ, దీనిని దుర్వినియోగపరిచేవారిని సమాజం నుంచి బహిష్కరిస్తామన్న ఏఐఎంపీఎల్‌బీ వైఖరిపై తాజాగా సీపీఐ స్పందించింది.
ట్రిపుల్ తలాఖ్ అనేది ఎంతమాత్రం న్యాయబద్ధమైనది కాదని, దీనిని ఖురాన్‌గానీ, సహజ ధర్మాలుగానీ విధించలేదని సీపీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో ముస్లిం వర్గంలోనే సంస్కరణలు రావాల్సిన అవసరముందని తాను భావిస్తున్నట్టు పేర్కొంది. ట్రిపుల్ తలాఖ్‌ను చాలా ఇస్లామిక్ దేశాలు అంగీకరించడం లేదని, భారత్‌లోని పలు ముస్లిం గ్రూపులు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయని తెలిపింది. ఈ విషయంలోని అన్ని అంశాలను పరిశీలించకుండానే ఏఐఎంపీఎల్‌బీ తనను తాను సమర్థించుకుంటున్నదని, ఈ విషయంలో ముస్లిం లా బోర్డు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరముందని సూచించింది.