ట్రిపుల్ తలాక్ పై కేంద్రం ప్రతిపాదించిన చర్యలను వ్యతిరేకించాలని ఏఐఎంపీఎల్‌బీ నిర్ణయించింది.
కోల్‌కతా: ట్రిపుల్ తలాక్, ఉమ్మడి పౌర స్మృతిపై కేంద్రం ప్రతిపాదించిన చర్యలను వ్యతిరేకించాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) నిర్ణయించింది. ఇక్కడ జరుగుతున్న ఏఐఎంపీఎల్‌బీ మూడు రోజుల సమావేశాల్లో రెండో రోజైన శనివారం ఈ మేరకు తీర్మానించారు. త్రిపుల్ తలాక్, ఉమ్మడి పౌరస్మృతి, ఇతర మత సంబంధ విషయాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తున్నారు.
‘త్రిపుల్ తలాక్ కొనసాగింపుపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. తరతరాలుగా ఉన్న ఈ సంప్రదాయం ముస్లిం మతహక్కుల్లో భాగమైంది. ఉమ్మడి పౌర స్మృతి అమలును కూడా వ్యతిరేకిస్తున్నాం’ అని ఏఐఎంపీఎల్‌బీ రిసెప్షన్ కమిటీ చైర్మన్, టీఎంసీ ఎంపీ సుల్తాన్ అహ్మద్ చెప్పారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఏఐఎంపీఎల్‌బీ ప్రారంభించిన సంతకాల సేకరణ కార్యక్రమానికి సుమారు 10 కోట్ల మంది ముస్లిం మహిళలు మద్దతు పలికారు.
ముస్లిం యువతను అనవసరంగా వేధించే అజెండాను కేంద్రం చేపట్టిందని సమావేశంలో ముక్తకంఠంతో దుయ్యబట్టారు. ముస్లింలను ప్రభుత్వం జాతి వ్యతిరేకులుగా చిత్రీకరిస్తోందని ఓ సభ్యుడు ఆరోపించారు. ముస్లింల మతహక్కుల్లోకి చొరబడేందుకు బీజీపీ యత్నిస్తోందని దీన్ని ఎంతమాత్రం సహించబోమని హెచ్చరించారు.