భారత్లో ఏకే-47 రైఫిల్స్ తయారీ?
ముంబై: శక్తిమంతమైన ఏకే-47 రైఫిల్స్ను భారత్లో తయారు చేసే అవకాశాలున్నాయి. భారతీయ కంపెనీల భాగస్వామ్యంతో కలసి ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు ఏకే-47 తయారీ సంస్థ రష్యాకు చెందిన 'కలష్నికోవ్' సుముఖంగా ఉంది. ఈ విషయంపై భారతీయ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. స్థానిక భాగస్వామ్యులతో సాంకేతికతను పంచుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
'2008 నుంచే భారత్ కంపెనీలు ఏకే-47 రైఫిల్స్ను తయారు చేయడానికి ఆసక్తిగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నాం. చర్చలు సానుకూలంగా ఉన్నా.. ఇంకా ఖరారు కాలేదు. అయితే భారత రక్షణ శాఖతో చర్చలు జరపలేదు' అని కలష్నికోవ్ కంసర్న్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలెక్సీ కృవోరుచ్కో చెప్పారు. ఏడాదికి కనీసం 50 వేల రైఫిల్స్ను తయారు చేయడంపై దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు.