రూ. 50 లక్షలకు అక్షయ్ ఖన్నాకు టోపీ
ముంబై: తక్కువ సమయంలోనే డబ్బును డబుల్ చేస్తామని నమ్మించి చేస్తున్న మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఉన్నతస్థాయి వ్యక్తులు కూడా ఇటువంటి మోసాల బారిన పడుతుండడం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ఉదంతమే ఇందుకు నిదర్శనం. రూ. 50 లక్షలు పెడితే 45 రోజుల్లో కోటి రూపాయల ఇస్తామన్న వాగ్దానాన్ని నమ్మి ఉన్నది పోగొట్టుకున్నారు.
తాను ఇచ్చిన డబ్బును కమోడిటీ మార్కెట్లో పెట్టుబడి పెట్టి 45 రోజుల్లోనే రెండింతలు చేస్తామని నమ్మించి రూ.50 లక్షలకు ముంచారని అక్షయ్ వాపోయారు. ఇన్టెక్ ఇమేజ్లో 2010 అక్టోబర్లో రూ. 50 లక్షలు పెట్టుబడులు పెట్టి మోసపోయానని మలబార్ హిల్స్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇన్టెక్ ఇమేజ్ ప్రెసిడెంట్, డైరెక్టర్గా వ్యవహరిస్తున్నఅంధేరీ ప్రాంతానికి చెందిన సత్యబ్రత చక్రవర్తి, ఆయన భార్య సోనా ఈ మోసానికి పాల్పడ్డారని పేర్కొన్నాడు.
గడువు ముగిసినా డబ్బు ఇవ్వకపోగా, సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతుండడంతో అక్షయ్ ఖన్నా పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి ఆర్థిక నేర నియంత్రణ విభాగానికి బదిలీ చేశామని మలబార్ హిల్స్ ఇన్స్పెక్టర్ వినయ్ బగాడే తెలిపారు.