
మన పొరుగునే గ్రహాంతరవాసులు!
లండన్: అనంత విశ్వంలో భూమిని పోలిన గ్రహం మరొకటి ఉందా? అనేది ఇప్పటికీ జవాబు లేని ప్రశ్నగానే మిగిలింది. దీనికి సంబంధించి ఖగోళ పరిశోధకులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా.. భూమిని పోలిన గ్రహం ఒకటి మనకి సమీపంలో ఉన్న నక్షత్రం చుట్టూ తిరుగుతోందని, ఇది భూమి నుంచి 4.2 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని వెల్లడించారు.
ఈ గ్రహంపై ద్రవరూపంలో నీరు ఉండే అవకాశం ఉందని, గ్రహాంతరవాసుల జీవనానికి అనుకూలమైన వాతావరణం ఈ గ్రహంపై ఉండే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్లానెట్ ప్రోక్సిమా బి అనే ఈ గ్రహాన్ని గతేడాది ఆగస్టులో కనుగొన్నారు.
ఇది దాదాపు భూమి పరిమాణంలో ఉంటుంది. యూకే లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్‌కు చెందిన పరిశోధకులు ఈ గ్రహంపై పరిశోధనలు చేస్తున్నారు. ప్రాక్సిమా సెంటారీ అనే నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఈ గ్రహం తన ఉపరితలంపై నీరు ఉండే స్థాయిలో ఆ నక్షత్రం నుంచి కాంతిని గ్రహిస్తోందని వెల్లడించారు. అయితే ఇక్కడ జీవం మనుగడ సాగించగలదా లేదా అనే విషయం తేలాల్సి ఉంది.