
ఏకంగా పార్లమెంట్‌లోనే ఏలియన్ల అవశేషాలంటూ ప్రదర్శించడంపై నాసా స్పంది..
మెక్సికో సిటీ: మెక్సికో పార్లమెంటు సమావేశాల్లో తాజాగా చోటు చేసుకున్న విచిత్ర పరిణామం.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మానవేతర అవశేషాలుగా పేర్కొంటూ రెండు వింత ఆకారాలను మంగళవారం ఏకంగా చట్టసభలోనే ప్రదర్శించారు కొందరు పరిశోధకులు. అలాగే.. తమ పరిశోధనల్లో ఇప్పటివరకూ వెలుగుచూసిన అంశాలను చట్టసభ్యులకు నివేదించారు. అయితే ఈ పరిణామంపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా స్పందించింది.
మెక్సికో పార్లమెంట్ ఏలియన్ల బాడీ వ్యవహారంలో పాదర్శకత అవసరమని నాసా అభిప్రాయపడింది. ‘‘ఇది ట్విటర్‌లోనే నేను చూశా. వాటి గురించి మా వద్ద ఎలాంటి సమాచారం లేదు. అయితే.. ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. మీదగ్గర అసాధారణమైనవి కనిపించినప్పుడు.. అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని బయటపెట్టాలి. అది నిజంగా వింతదే అయితే.. శాంపిల్స్‌ని శాస్త్రీయ సమాజానికి అందుబాటులో ఉంచండి అంటూ మెక్సికన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డేవిడ్ స్పెర్‌గెల్.
డేవిడ్ స్పెర్‌గెల్ ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ ఆస్ట్రోఫిజిక్స్ విభాగానికి మాజీ అధిపతి. ప్రస్తుతం యూఏపీకి అధ్యక్షత వహిస్తున్నారు.యూఏపీ అంటే unidentified anomalous phenomeno. గాల్లో ఎగిరే వింత వస్తువులు, పల్లెలు, ఆకారాలుగా ఇంతకు ముందు యూఎఫ్‌వో UFO(Unidentified Flying Objects) పేరుతో ఇది జనాలకు పరిచయం. అయితే యూఎఫ్‌వోనే ఇప్పుడు యూఏపీగా వ్యవహరిస్తున్నారు. నాసా కూడా.. మానవేతర జీవుల మనగడ వాస్తవమా? కదా? అనేవిషయంపై అధ్యయనం కోసం UAP పేరుతో ఓ అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఎప్పటికప్పుడు తమ నివేదికలను అమెరికా ప్రభుత్వానికి నివేదిస్తుంటుంది.
ప్రస్తుతానికి స్పెర్‌గెల్ యూఏపీకి గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా.. త్వరలోనే ఆ బృందానికి పూర్థిస్థాయి డైరెక్టర్ నియామకం ఉంటుందని నాసా తాజాగా ప్రకటించింది.
మరోవైపు మెక్సికో పార్లమెంట్‌లో ప్రదర్శించిన వింత ఆకారాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పెరూలోని నజ్కా ఎడారిలో కుస్కోలో గల డయాటమ్ గనుల్లో జరిపిన తవ్వకాల్లో 2017లో రెండు విచిత్ర ఆకారాలు బయటపడ్డాయని, వెయ్యి సంవత్సరాల కిందటివని, గ్రహాంతరవాసులవేనని సదరు పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధకుల్లో.. మెక్సికోతో పాటు అమెరికా, జపాన్, బ్రెజిల్ పరిశోధకులూ ఉన్నారు. గ్రహాంతరవాసుల ఉనికి నిజమే అయ్యుండొచ్చని వారు అభిప్రాయపడుతుండడం గమనార్హం.
మరోవైపు మెక్సికో పాత్రికేయుడు జోస్ జైమ్ మౌసాన్ స్పందిస్తూ.. ‘‘ఆ వింత ఆకారాలు మానవేతరులవని డీఎన్‌ఏ పరీక్షల్లో స్పష్టమైందన్నారు. భూ ప్రపంచంలో వేటికీ అవి సరిపోలడం లేదు. కాబట్టే.. గ్రహాంతరవాసుల ఉనికి వాస్తవమని నమ్మాల్సి ఉంటుంది. అని పేర్కొన్నారు. మెక్సికో కాంగ్రెస్‌లో ప్రదర్శించిన ఏలియన్ అవశేషాల వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. వాటికి కౌంటర్ మీమ్స్ సైతం విపరీతంగా వైరల్ అవుతున్నాయి.