
‘ఉల్లి’తో తీరనున్న తగువు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నడుమ లొల్లిని త్వరలో ఉల్లి తీర్చబోతుందట. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తీర్చలేని రెండు రాష్ట్రాల తగువును ఉల్లి ఎలా తీరుస్తుందనుకుంటున్నారా...! రెండు రాష్ట్రాల నడుమ ప్రధాన తకరారు అయిన ఎంట్రీ ట్యాక్స్ వివాదం ఇప్పుడు ఓ కొలిక్కి రానుందట. ఇరు రాష్ట్రాలు ఎంట్రీ ట్యాక్స్ వివాదంపై కౌంటర్ సిగ్నేచర్ ఒప్పందం చేసుకునేందుకు రెడీ అవుతున్నాయట. తకరారు పరిష్కారానికి అసలు కారణం ఉల్లి కొరతేనని రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయి.
దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత కారణంగా తెలంగాణ నుంచి ఏపీకి ఉల్లి కోసం లారీలు అధిక సంఖ్యలో వెళుతున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు అధిక సంఖ్యలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి లారీలు వెళుతున్నాయి. సరిహద్దు దాటేందుకు తెలంగాణ లారీలు ఏపీ రవాణా శాఖకు రూ.6 వేలు చెల్లించాల్సి వస్తుంది.
ఈ భారం ఉల్లి వినియోగదారులపై మోపుతున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి ఎంట్రీ ట్యాక్స్ విషయంలో కౌంటర్ సిగ్నేచర్ విధానం పాటిద్దామని ప్రతిపాదించింది. ఏపీ ప్రభుత్వం అంగీకరిస్తే ఎంట్రీ ట్యాక్స్ సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కేంద్రానికి, గవర్నర్‌కు ఫిర్యాదులు చేసినా లాభం లేని లొల్లి ఉల్లితో తీరబోతోంది. ప్రభుత్వాలు పడగొట్టిన చరిత్ర ఉన్న ఉల్లికి ప్రభుత్వాల్ని కలిపే శక్తి కూడా ఉందన్న మాట. రెండు రాష్ట్రాలు అవగాహనతో ముందుకెళితే అక్టోబర్ నుంచి రెండు రాష్ట్రాల ప్రధాన వివాదం ఎంట్రీ ట్యాక్స్ కొలిక్కి వస్తుంది.