
నిలిచిన అమరనాథ్ యాత్ర
శ్రీనగర్: ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఈ రోజు అమరనాథ్ యాత్ర నిలిపివేసినట్లు పోలీసు ఉన్నతాధికారి శుక్రవారం శ్రీనగర్లో వెల్లడించారు. యాత్రకు వెళ్లే మార్గంలో ఆకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. దాంతో మార్గమధ్యంలో భారీగా కొండ చరియలు విరిగిపడుతున్నాయని చెప్పారు. దీంతో అమరనాథ్ యాత్రను ఈరోజు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితిపై నేటి సాయంత్రం సమీక్షి నిర్వహిస్తామన్నారు.
ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా శ్రీనగర్ - లేహ్ జాతీయరహదారిపై ఉన్న కులాన్ గ్రామంలో 15 ఏళ్ల బాలిక మృతి చెందిందన్నారు. ఈ గ్రామంలో అమరనాథ్ యాత్రకుల కోసం బేస్ క్యాంప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే అమరనాథ్ యాత్రికులంతా క్షేమంగా ఉన్నారని చెప్పారు. కాశ్మీరీ వ్యాలీలో మరో రెండు రోజుల పాటు సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణశాఖ అధికారులు తెలిపినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.