
దీదీకి అన్నాహజారే మద్దతు
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం
నా ఎజెండా అమలుచేసేందుకు మమత అంగీకరించారు
ఆమె నిరాడంబరత, సమాజం పట్ల దృక్పథం అద్భుతం
దీదీ ఆధ్వర్యంలో రాజకీయ వ్యవస్థలో మార్పులు వస్తాయి
కేజ్రీవాల్, మోడీలను బలపరచబోను: హజారే
న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతు ప్రకటించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆమెకు, ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. దీదీకి అధికారమిస్తే దేశ ప్రగతి వేగవంతమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కేజ్రీవాల్‌ను, మోడీని బలపరచబోనని.. అలాగని వ్యతిరేకించబోనని హజారే స్పష్టం చేశారు. మరోవైపు తృణమూల్‌కు మద్దతివ్వాలన్న హజారే నిర్ణయాన్ని తప్పుబడుతూ.. మహిళా ఉద్యమ సంస్థలు ఆయనకు బహిరంగ లేఖ రాశాయి. ఢిల్లీలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో హజారే మాట్లాడారు. ఆయన మాటల్లోనే...
- వివిధ రాజకీయ, పాలనా, భూ సంస్కరణలకు సంబంధించిన 17 సూత్రాల ఎజెండాను అన్ని రాజకీయ పార్టీలకు పంపాను.
- వాటన్నింటినీ అమలు చేసేందుకు మమతా బెనర్జీ అంగీకరించడంతో.. ఆమెకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం.
- నేను పంపిన ఎజెండాపై కేజ్రీవాల్ ఏ మాత్రం స్పందించలేదు. దాంతో ఆయనకు మద్దతిచ్చే ప్రసక్తే లేదు.
- తృణమూల్ పార్టీకి మాత్రమేకాదు.. మమతా బెనర్జీ వ్యక్తిత్వం, నిరాడంబరత, సమాజం పట్ల ఆమె దృక్పథాన్ని చూసే మద్దతిస్తున్నాం.
- ఒక రాష్ట్రానికి సీఎం అయినా.. ఆమె చిన్న ఇంట్లో ఉంటారు, ప్రభుత్వ వాహనాలనూ వాడరు.
- వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దీదీ నిలబెట్టిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తాం. దాంతోపాటు అవినీతి రహిత రాజకీయాల కోసం మార్చి నుంచి దేశవ్యాప్తంగా పర్యటిస్తా.
- ఆమె 100 సీట్లు సాధించగలిగినా.. రాజకీయ వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి తోడ్పడుతుంది.
- కాగా, ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారి, అదనపు డీజీ వినయ్‌కుమర్ సింగ్ రాసిన ‘ఈజ్ ఇట్ పోలీస్’ అనే పుస్తకాన్ని హజారే ఆవిష్కరించారు.
- ఈ సందర్భంగా తాను మమతా బెనర్జీకి మాత్రమే మద్దతు ఇస్తున్నానని, ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు.
కొన్ని అంశాలపై విభేదాలున్నాయి: మమత
హజారే ఎజెండాలోని చాలా అంశాలను బెంగాల్‌లో మా ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది.
- భూసేకరణ వంటి రెండు మూడు అంశాల్లో కొన్ని విభేదాలు ఉన్నాయి. వాటిపై చర్చిస్తాం.
- హజారే సలహా తీసుకుని బెంగాల్, అస్సాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు ఉత్తర, దక్షిణ భారత్‌లోని మరిన్ని చోట్ల లోక్‌సభకు పోటీ చేస్తాం.
- యూపీఏ, ఎన్డీఏలలో దేనికీ మద్దతివ్వబోం.
మమతకు మద్దతు వద్దు: మహిళా సంఘాలు
వచ్చే ఎన్నికల్లో తృణమూల్‌కు మద్దతుగా ప్రచారం చేయాలన్న హజారే నిర్ణయాన్ని తప్పుబడుతూ మహిళా ఉద్యమ సంస్థలు ఆయనకు బహిరంగ లేఖ రాశాయి. ఇండియన్ డెమొక్రాటిక్ విమెన్ అసోసియేషన్, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ విమెన్ అసోసియేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ విమెన్ తదితర సంస్థలు సంయుక్తంగా రాసిన ఈ లేఖలో... ‘‘దీదీకి మీరు మద్దతు ప్రకటించారని తెలిసి, ఆశ్చర్యానికి లోనయ్యాం. బెంగాల్‌లో ఆమె పార్టీ తృణమూల్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అరాచకాలు పెరిగిపోయాయి.
మహిళలకు భద్రమైన రాష్ట్రంగా ఉన్న బెంగాల్‌లో ఏ మాత్రం భద్రత లేని పరిస్థితి కల్పించారు. మహిళలు, యువతులు, పిల్లలపై జరుగుతున్న ఎన్నో దారుణమైన నేరాలకు అధికార పార్టీ నేతలు, కార్యకర్తలే నిందితులు. తమ కులం కానివాడిని ప్రేమించినందుకు పంచాయతీ ఆదేశంతో ఓ గిరిజన యువతిపై 13 మంది చేసిన ఘటనపై పోలీసులు, అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఇలాంటివి మరెన్నో ఉన్నాయి. తృణమూల్‌కు మద్దతివ్వాలన్న మీ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తారని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.