మళ్లీ దేశవ్యాప్త యాత్రకు అన్నా హజారే
సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారే గతంలో బీహార్ నుంచి ప్రారంభించి ఆపేసిన దేశవ్యాప్త చైతన్యయాత్ర పునరుద్ధరించాలని భావిస్తున్నారు. భారతదేశంలో వ్యవస్థాగత మార్పులు, ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు, తన సందేశాలను తీసుకెళ్లేందుకు వాలంటీర్లను నియమించుకునేందుకు అన్నా హజారే ఈ యాత్ర చేపట్టారు. మధ్యలో ఆపేసిన చైతన్యయాత్రను తిరిగి ప్రారంభించాలని హజారే భావిస్తున్నారని ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ తెలిపారు.
లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాము ఈ యాత్ర ప్రారంభించలేదని ఆయన స్పష్టం చేశారు. సచ్ఛీరులను ఎన్నుకునేలా ఓటర్లను చైతన్యవంతులను చేయాలన్నదే తమ ధ్యేయమని వెల్లడించారు. మంచివారిని ఎన్నుకుంటే వ్యవస్థలో సానుకూల మార్పులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నా హజారేతో కలిసి వీకే సింగ్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు.