మరో ఏటీఎంలో నకిలీ నోటు కలకలం
న్యూఢిల్లీ: దేశరాజధానిలో మరో ఏటీఎంలో నకిలీ నోటు వ్యవహారం కలకలం రేపింది. సౌత్ ఢిల్లీ అమర్ కాలనీ ప్రాంతంలోని ఒక ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలో నకిలీ రూ.2 వేల నోట్లు దర్శనమిచ్చాయి. గతనెలలో ఈ నకిలీ రూ.2వేల నోట్లు బ్యాంకు ఖాతాదారుల్లో ఆందోళన సృష్టించిన ఘటన మరువకముందే గురువారం మరో నకిలీనోటు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్థానిక వినియోగదారుడు చందన్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినపుడు చిల్డ్రన్ బ్యాంకు ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నకిలీ నోటు కనిపించడంతో వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుడు చందన్ ఫిర్యాదు ఆధారంగా, 489 బి, ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని డీసీపీ రోమిల్ బానియా చెప్పారు. దీనిపై లోతుగా పరిశీలన నిమిత్తం ఈ కేసును క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
అయితే అత్యధిక విలువ కలిగిన నోట్లలో ఫేక్ నోట్లు వరుసగా వెలుగు చూడడంతో వినియోగదారుల్లో ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఒకనెలరోజుల్లో ఇది రెండవ ఘటన కాగా, ఈ నకిలీ నోట్లపై 'మనోరంజన్ బ్యాంక్ , చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉండడం గమనార్హం.
కాగా ఫిబ్రవరి 6 న సంగం విహార్ లో బ్యాంకు ఖాతాదారుడు రోహిత్ కుమార్ ఎస్‌బీఐ ఏటీ ఏంలో డ్రా చేసినపుడు ఇలాంటి నకిలీ రూ. 2వేల నోటు వెలుగు చూసింది. ఈ సంఘటనలో ఇషాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.