హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం
ఏపీ అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాద్తో సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ సమావేశాల నిర్వహణపై చర్చించారు.
అలాగే ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ దాని మిత్రపక్షం బీజేపీ ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలోని వచ్చి 14 నెలలు అయింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టమైన వివరణ ఇవ్వడం లేదు. హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ అంటూ మంత్రులతోపాటు నాయకులు అడపాదడపా ప్రకటిస్తున్నారు. దాంతో రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
హోదాపై ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధించాయి. దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆ పార్టీ నేతలు ఈ రోజు సమావేశమయ్యారు. అసెంబ్లీ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాంపై వారు ఈ సందర్భంగా చర్చించారని సమాచారం. అలాగే ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఈ రోజు సాయంత్రం ఆ పార్టీ నేతలతో భేటీ కానున్నారు. ప్రభుత్వాన్ని ఎండగట్టే అంశాలపై అధినేత...ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను దిశానిర్దేశం చేయనున్నారు.