
నన్ను సొంతవాడిలా చూసుకున్నారు: చంద్రబాబు
- దాసరి ఒక వ్యక్తికాదు.. వ్యవస్థ: ఏపీ సీఎం నివాళి
హైదరాబాద్: దాసరి నారాయణరావు ఓ వ్యక్తి కాదు వ్యవస్థ అని కీర్తించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దర్శకుడిగానేకాక నటుడు, నిర్మాతగా తన ప్రత్యేకతను చాటుకున్నారని, రాజకీయాల్లోనూ రాణించి ఉన్నత పదవులు అధిరోహించారని, అదే సమయంలో సినీకార్మికుల బాగు కోసం ఎనలేని కృషి చేశారని చంద్రబాబు అన్నారు. బుధవారం ఫిలిం ఛాంబర్ లో దాసరి పార్థివదేహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘మోహన్‌బాబు ద్వారా చాలా కాలం కిందటే దాసరి పరిచయం అయ్యారు. నా వివాహం సమయంలో, ఆ తర్వాత కూడా ఎంతో సాన్నిహితం ఉండేది. నారాయణరావు-పద్మ దంపతులకు నేనంటే చాలా అభిమానం. నన్ను సొంతవాడిలా చూసుకునేవారు. దాసరి మరణంతో చిత్రపరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది. అయితే ఆయన చేసిన పనులు శాశ్వతంగా గుర్తుండిపోతాయి. తెలుగువారిగుండెల్లో దాసరి చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా’నని చంద్రబాబు అన్నారు.