ట్రాఫిక్ పోలీసుల సహకారంతో విజయవంతమైన గుండెమార్పిడి
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రి నుంచి గుండె సేకరణ..
జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో శస్త్రచికిత్స
ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను ఆపేసి, సిగ్నళ్లను నిలిపేసి.. ప్రత్యేక మార్గం ఏర్పాటు
12.7 కిలోమీటర్లు, 9 కూడళ్లు.. దాటింది ఎనిమిది నిమిషాల్లోనే..
సాక్షి, హైదరాబాద్: సమయం రాత్రి 9.30.. సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రి ప్రాంతం నుంచి ఒక వాహనం బయలుదేరింది.. జూబ్లీహిల్స్ వైపు దూసుకెళుతోంది.. నిరంతరం ట్రాఫిక్‌తో కిటకిటలాడే మార్గమది.. కానీ, ట్రాఫిక్‌ను ఎక్కడిక్కడ ఆపేశారు.. కూడళ్లన్నింటి వద్ద సిగ్నళ్లను నిలిపేశారు.. ఈ వాహనం వెళుతున్న దారిలో ఉన్న వాహనాలన్నింటినీ వేగంగా పంపించారు.. మరికొన్నింటిని దారి మళ్లించారు.. ఎక్కడా ఆగాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక మార్గాన్ని కల్పించారు.. రాష్ట్రపతి వంటివారు ప్రయాణిస్తుంటే తీసుకునే ముందుజాగ్రత్తల్లా ఉన్నాయా చర్యలు... ఇదంతా ఒక యువకుడి ప్రాణాన్ని నిలబెట్టేందుకు వైద్యులు, ట్రాఫిక్ పోలీసులు కలిసి చేసిన అద్భుతం. సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి నుంచి సేకరించిన గుండెను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉన్న ఒక యువకుడికి అమర్చేందుకు.. ఇలా అసాధారణ ట్రాఫిక్ అప్రమత్తత మధ్య తీసుకువెళ్లారు.
ఈ ఆస్పత్రుల మధ్య 12.7 కిలోమీటర్ల దూరాన్ని తొమ్మిది కూడళ్లను దాటుకుని వెళ్లేందుకు ఆ సమయంలో సాధారణంగా 45 నిమిషాలకు పైగా పడుతుంది. కానీ, ఈ గుండెను తీసుకువెళుతున్న అంబులెన్సు కేవలం 8 నిమిషాల్లో దూసుకుపోగలిగింది. ‘డైలేటెడ్ కార్డియోపతి (గుండె కండరాలు, రక్తనాళాలు పూర్తిగా దెబ్బతినడం)’తో బాధపడుతున్న గుంటూరు జిల్లా కారంపూడికి చెందిన ఫార్మసీ విద్యార్థి వీరాంజనేయులు (19) కొద్ది నెలల కింద అపోలో ఆస్పత్రికి వచ్చారు. వీరాంజనేయులుకు గుండె మార్పిడి మాత్రమే పరిష్కారమని చెప్పిన వైద్యులు.. బాధితుడి సమాచారాన్ని నిమ్స్ జీవన్‌దాన్ కేంద్రానికి చేరవేశారు. నవంబర్ 11న సాయంత్రం 6.30 గంటల సమయంలో యశోదా ఆస్పత్రిలో ఒక వ్యక్తి బ్రెయిన్‌డెడ్ స్థితికి వెళ్లినట్లు ‘జీవన్‌దాన్’కు సమాచారం అందింది. జీవన్‌దాన్ సిబ్బంది అవయవదానానికి ఆ వ్యక్తి బంధువుల అంగీకారం తీసుకుని.. సమాచారాన్ని అపోలో ఆస్పత్రికి చేరవేశారు.
వయసు, రక్తం గ్రూపు వంటివి మ్యాచ్ కావడంతో అపోలో ఆస్పత్రి వైద్యులు సర్జరీకి ఏర్పాట్లు చేసుకున్నారు. యశోద ఆస్పత్రిలోని వ్యక్తి నుంచి సేకరించిన గుండెను పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ పద్మనాభరెడ్డి సహాయంతో 8 నిమిషాల్లోనే అపోలో ఆస్పత్రికి తరలించారు. సకాలంలో గుండెను తరలించడం వల్ల శస్త్రచికిత్స విజయవంతమైనట్లు అపోలో వైద్యుడు విజయ్ దీక్షిత్ చెప్పారు. తరలింపులో పోలీసులు అందించిన సహకారం మరువలేనిదని సోమవారం ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. ‘జీవన్‌దాన్’ పథకం కింద హైదరాబాద్‌లో తొలిసారి ఉచితంగా జరిగిన గుండెమార్పిడి శస్త్రచికిత్స ఇది కావడం గమనార్హం.
నాలుగు గంటల్లోపే..
గుండె మార్పిడి చేయాలంటే.. దాత వయస్సు, రక్తం గ్రూపు బాధితుడికి మ్యాచ్ కావాలి. సేకరించిన గుండెను పది డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉంచి తరలించాల్సి ఉంటుంది. ఆ సమయంలో అందులో ఆక్సిజన్, గ్లూకోజ్ శాతాలు తగ్గకుండా చూడాలి. బాధితుడి దెబ్బతిన్న గుండె స్థానంలో అమర్చాలి. గుండెను తీయడం నుంచి బాధితుడికి అమర్చడం వరకూ అంతా కూడా నాలుగు గంటల లోపుగా జరగాలి. లేకపోతే అది పనిచేయదు. కాగా, విదేశాల్లో గుండె మార్పిడి శస్త్రచికిత్సకు రూ. కోటిన్నరకుపైగా ఖర్చు అవుతుండగా.. హైదరాబాద్‌లో రూ. 15 లక్షల వరకు మాత్రమే అవుతుందని అపోలో ఆస్పత్రి ఎండీ సంగీతారెడ్డి చెప్పారు.