తూటాకు తూటా: బిక్రంసింగ్
న్యూఢిల్లీ: సైన్యాధిపతి జనరల్ బిక్రంసింగ్ పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. పాకిస్థాన్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని.. అదే రీతిలో స్పందిస్తామన్నారు. సైనిక దినోత్సవం సందర్భంగా మీడియా సమావేశంలో బిక్రంసింగ్ మాట్లాడారు. భారత జవాను తలనరికిన పాక్ సైనికులపై ఆర్మీ ప్రతీకారం తీర్చుకోలేదన్న వాదనను బిక్రంసింగ్ ఖండించారు. ‘‘చర్య తీసుకున్నాం.. డిసెంబర్ 23నాటి జియో టీవీ కథనాన్ని చూడండి.
పాక్ ఆర్మీ అధికారి, తొమ్మిది మంది జవాన్లు మరణించారని.. 12-13 మంది గాయాలపాలయ్యారని తెలుస్తుంది. ఇది భారత జవాన్లు సాధిం చిందే’’ అని బిక్రంసింగ్ వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్లో సైన్యం ఉండాల్సిందేనన్నారు. ఆర్మీ బలగాల మోహరింపు విషయంలో పరిస్థితులు మెరుగుపడే వరకూ వేచి ఉండాలని చెప్పారు. సమీప భవిష్యత్తులో పోరాట ప్రాంతా ల్లో మహిళా సైనికాధికారులను నియమించే అవకాశం లేదన్నారు.