పాక్ సైనిక మరణాల సంఖ్య పెరగనంత వరకు...
పాకిస్తాన్ సైనికుల మరణాల సంఖ్య పెరగనంత వరకు ఇస్లామాబాద్కు బుద్ధి రాదని ప్రముఖ రక్షణ నిపుణుడుఎస్ఆర్ సిన్హో అన్నారు.
భోపాల్ : పాకిస్తాన్ సైనికుల మరణాల సంఖ్య పెరగనంత వరకు ఇస్లామాబాద్కు బుద్ధి రాదని ప్రముఖ రక్షణ నిపుణుడు, మేజర్ రిటైర్డ్ జనరల్ ఎస్ఆర్ సిన్హో అన్నారు. ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఇలానే ఉల్లంఘిస్తూ ఉంటే, భారత ఆర్మీ పాకిస్తానీ బోర్డర్ పోస్టులపై దాడులు జరపాలని ఎస్ఆర్ సిన్హో పిలుపునిచ్చారు. పాకిస్తాన్కు కొత్త ఆర్మీ చీఫ్ను ఎంపికయ్యాక, కాల్పుల విమరణ ఒప్పంద ఉల్లంఘన ఘటనలు తగ్గుతాయని భారత్ భావించిందని, కానీ అది జరుగడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్, ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ను తన చెప్పుచేతల్లో నడిపేవారని, ఆయన ఏది అనుకుంటే అది జరిగేదని చెప్పారు.
కొత్త ఆర్మీ చీఫ్ ఎంపికతో నవాజ్ షరీఫ్ కొంత ఉపశమనం పొందుతారని ఆశించామని, కానీ మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన జరుగుతుందన్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారం కానంతవరకు నియంత్రణ రేఖ వెంబడి ఈ కాల్పులు జరుగుతూనే ఉంటాయని భావిస్తున్నానని పేర్కొన్నారు. ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్ చాలదని, పాకిస్తాన్ ఆర్మీ పోస్టులపై కూడా భారత ఆర్మీ దాడులు జరపాలని సూచించారు. ఇది వారికి, వారి ప్రభుత్వానికి ఎలాంటి ప్రభావం చూపదన్నారు. మూడు వారాల ప్రశాంతత అనంతరం పాకిస్తానీ దళాలు మళ్లీ డిసెంబర్ 16న జమ్మూకశ్మీర్ పూంచ్ సెక్టార్లోని భారత ఆర్మీ పోస్టులపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. మళ్లీ మళ్లీ పాకిస్తాన్ తెగబడుతుండటంతో రక్షణ నిపుణుడు ఈ మేరకు సూచనలు చేశారు.