మెట్రో రైల్లో ప్రమాణ స్వీకారానికి..
సామాన్యుడంటే సామాన్యుడే. భారీ కాన్వాయ్, కుయ్ కుయ్ అని మోగే సైరన్లు, ముందు.. వెనక పైలట్ వాహనాలు ఇవేవీ తనకు అక్కర్లేదని, సగటు ఢిల్లీ వాసులందరిలాగే తాను కూడా మెట్రో రైల్లోనే వస్తానని ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెబుతున్నారు. తానొక్కడినే కాదు.. మొత్తం ఎమ్మెల్యేలంతా కూడా ఈ కార్యక్రమానికి మెట్రో రైళ్లలోనే వస్తామంటున్నారు. రాం లీలా మైదాన్లో శనివారం నాడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. కౌశాంబిలోని తన ఇంట్లో శుక్రవారం నిర్వహించిన 'జనతా దర్బార్'లో ఆయన మెట్రోరైలు ప్రయాణం విషయం చెప్పారు.
జనతా దర్బార్ గురించి విలేకరుల అడగ్గా, పై నుంచి కింది వరకు వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని, అందుకే ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వద్దకు నేరుగా వస్తున్నారని కేజ్రీవాల్ చెప్పారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. ప్రజల అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, వాళ్ల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు తాము కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. అయితే దాదాపు 90 శాతం వరకు సమస్యలు స్థానికమేనని, వాటిని 'మొహల్లా (వీధి) సభ'లతో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అప్పుడు ప్రజలు తమ సమస్యలతో కాక.. ఇతర సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వద్దకు వస్తారన్నారు.
ఇక ఢిల్లీలో సీఎన్‌జీ రేట్ల పెంపుపై ఆమ్ఆద్మీ చీఫ్, కాబోయే సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు రెండు రోజుల ముందు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఇదే విషయంపై కేంద్రాన్ని వివరణ అడుగుతామన్న ఆయన... సీఎన్‌జీ రేట్ల పెంపును నిరసిస్తూ సమ్మెకు దిగుతామన్న ఆటోవాలలతో చర్చిస్తామని చెప్పారు. సమ్మె చేపట్టవద్దని ఆటోవాలాలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.