మరింత చేరువగా జన్యువైద్యం
- కొత్త టెక్నాలజీతో తగ్గుతున్న ఖర్చులు
- సీసీఎంబీ డెరైక్టర్ మోహన్‌రావు
- జన్యుశాస్త్ర పోకడలపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: జన్యుశాస్త్రంలో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లో శరవేగంగా వస్తున్న మార్పులు సమీప భవిష్యత్తులో వైద్యంతోపాటు అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయని, వ్యక్తుల జన్యుక్రమం ఆధారంగా వారికే ప్రత్యేకమైన మందులు ఇవ్వడమూ అందుబాటులోకి వస్తుందని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డెరైక్టర్ డాక్టర్ సి.హెచ్.మోహన్‌రావు తెలిపారు. సైజినోమ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో ‘నెక్స్‌ట్ జెన్ జినోమిక్స్, బయాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ అండ్ టెక్నాలజీస్’ పేరుతో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది.
సీసీఎంబీ సహకారంతో చేపట్టిన ఈ సదస్సు ప్రారంభోత్సవానికి హాజరైన డాక్టర్ మోహన్‌రావు జన్యుశాస్త్రంలో వస్తున్న మార్పులు, తద్వారా మానవాళికి ఒనగూరనున్న ప్రయోజనాలను విలేకరులకు వివరించారు. మానవ జన్యుపటాన్ని తెలుసుకోవాలంటే కొన్నేళ్ల క్రితం వరకూ కోట్ల రూపాయలు ఖర్చయ్యేవని, ఇమేజ్ ప్రాసెసింగ్, ప్యారెలల్ కంప్యూటింగ్‌ల పుణ్యమా అని ఇప్పుడు రూ.1.5 లక్షలతోనే తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు.
అమెరికా, యునెటైడ్ కింగ్‌డమ్ వంటి దేశాల్లో ప్రజలందరి జన్యుపట ఆవిష్కరణకు, తద్వారా వ్యక్తిగత వైద్యం అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రొమ్ముకేన్సర్‌కు వ్యక్తి జన్యుక్రమం ఆధారంగా మందులు ఎంపిక చేసే పద్ధతి అవలంబిస్తున్నారు. సదస్సు చైర్మన్ డాక్టర్ శేఖర్ శేషగిరి మాట్లాడుతూ జినోమిక్స్ కేవలం వైద్యరంగానికి మాత్రమే పరిమితం కాలేదని, వ్యవసాయంలోనూ మార్పులు తీసుకురాగలదని అన్నారు.
జన్యు పరిశోధనల్లో సామాజిక న్యాయం
ఇప్పటివరకూ జరిగిన జన్యుపరిశోధనల్లో అధికశాతం యూరోపియన్ ప్రజలను దృష్టిలో ఉంచుకుని జరిగాయని అమెరికా అధ్యక్షుడు ఒబామా సలహాదారు, డాక్టర్ ఎస్తవాన్ తెలిపారు. అమెరికా జరిపిన అధ్యయనం ద్వారా ఈ విషయం తెలిసిందని, ఫలితంగా జన్యుశాస్త్ర ఫలాలు ప్రజలందరికీ చేరువ కాలేకపోయాయన్నారు. అమెరికా ప్రజలకు జన్యుక్రమ ఆధారిత వ్యక్తిగత వైద్యం అందించే ప్రయత్నాలు వేగంగా ముందుకెళుతున్నాయని చెప్పారు.
భారత్ ప్రజల్లో వైవిధ్యం ఎక్కువ: డాక్టర్ తంగరాజ్
జన్యుపరంగా భారత్‌లో వైవిధ్యం ఎక్కువని, కనుక అన్ని జాతుల ప్రజల జన్యుక్రమాలపై పరిశోధనలు విసృ్తతంగా చేపట్టాల్సిన అవసరం ఉందని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్ తెలిపారు. జన్యుక్రమం ఆధారంగా చూస్తే దేశంలో దాదాపు 4,000 వర్గాలున్నాయని చెప్పారు.