
సొంత ఎంపీపై బీజేపీ ఫైర్
పట్నా: లాలూ ప్రసాద్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా మాట్లాడిన బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హాపై సొంత పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. శత్రుఘ్నసిన్హా విశ్వాసఘాతకుడని, ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ అన్నారు. తన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న లాలూకు బిహార్ సీఎం నితీశ్ కుమార్ తనకు తానుగా దూరంగా ఉన్నారని, బీజేపీకి శత్రువుగా మారిన శత్రుఘ్నసిన్హా మాత్రం లాలూను సమర్థిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో తిరుగుబాటు నేతగా శత్రుఘ్నసిన్హా వ్యవహరిస్తున్నారని సుశీల్ మోదీ ట్వీట్ చేశారు.
మరోవైపు ‘షాట్‌గన్’కు లాలూ తనయుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ బాసటగా నిలిచారు. శత్రుఘ్నసిన్హా వాస్తవాలు మాట్లాడారని అన్నారు. సుశీల్ మోదీ అబద్దాలకోరని, ఆయన పూటకో రంగు మారుస్తారని విమర్శించారు. ఆయన వర్ణ అంధత్వంతో బాధ పడుతున్నారని ధ్వజమెత్తారు. వ్యతిరేక రాజకీయాలకు స్వస్తి పలకాలని, ప్రత్యర్థులపై బురద చల్లడం మానుకోవాలని బీజేపీకి శత్రుఘ్నసిన్హా నిన్న సూచించారు.