భూమి కోసం బలిదానం
అస్సాంలో వ్యవసాయ ఉద్యమకారుడి ఆత్మాహుతి
ఆందోళనలు, నిరసనలతో అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం
గువాహటి: ఓ వ్యవసాయ ఉద్యమకారుడు ఆత్మాహుతికి పాల్పడటంతో అస్సాం ఆందోళనలతో అట్టుడికింది. పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు భూమి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ ఉద్యమకారుడు ప్రణబ్ బోరో (45) ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి (కేఎంఎస్‌ఎస్) ఆధ్వర్యంలో సోమవారం రైతులు రాష్ట్ర సచివాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో ప్రణబ్ బోరో ఆత్మాహుతియత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన అతనిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. బోరోను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. వంద శాతం కాలిన గాయాలతో బోరో సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచాడని వైద్యులు చెప్పారు. బోరో ఆత్మాహుతి వార్తతో అస్సాం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఆందోళనకారులు నేషనల్ హైవే 37 సహా రహదారుల దిగ్బంధం, రైల్ రోకోలకు దిగారు. జోర్‌హత్, శివసాగర్, మోరిగావోన్, సోనిత్‌పూర్ జిల్లాల్లో కేఎంఎస్‌ఎస్ కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టారు. దీంతో 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆత్మాహుతి ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. కేఎంఎస్‌ఎస్ డిమాండ్ ఆమోదయోగ్యం కాదని.. చొరబాటుదారులకు భూమి పట్టాలు ఎలా ఇస్తామని ఆయన ప్రశ్నించారు.
రాహుల్ ర్యాలీపై ప్రభావం
ప్రణబ్ బోరో ఆత్మాహుతితో కేఎంఎస్‌ఎస్ అధ్యక్షుడు అఖిల్ గొగోయ్ 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వమే బోరో ఆత్మాహుతికి కారణమని ఆయన ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మంగళవారం అస్సాంలో పర్యటించనున్నారు. కేఎంఎస్‌ఎస్ బంద్ ప్రభావం రాహుల్ పర్యటనపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్ పర్యటనను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరతామని అఖిల్ ప్రకటించారు.