టెక్సాస్ రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో అడవి దహనం
కనాడియన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో అడవికి నిప్పంటుకుని లక్షల ఎకరాల్లో పచ్చదనం మటుమాయమైంది. చెట్లు కాలిబూడిదయ్యాయి. సమీప ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇప్పటికే 2,00,000 ఎకరాల విస్తీర్ణంలో అటవీప్రాంతాన్ని కాల్చేసిన కార్చిచ్చు మరింత పెద్దదవుతూ అక్కడి ప్రజలు, ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా పరిణమించింది. దీంతో టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ దాదాపు 60 గ్రామాల్లో విపత్తుగా ప్రకటించి సహాయక చర్యలను ముమ్మరంచేశారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.
అణ్వాయుధాల కేంద్రం బంద్
ఈ ప్రాంతంలో సంభవించే అతి పెద్ద కార్చిచ్చులకు ది స్మోక్‌హౌజ్ క్రీక్‌ఫైర్‌గా పిలుస్తుంటారు. భయంకరమైన ఎండ, వేడి, పొడి వాతావరణం కారణంగా ఉత్తర టెక్సాస్ అడవిలో కార్చిచ్చు అంటుకుంది. సోమవారం మొదలైన ఈ కార్చిచ్చు టెక్సాస్ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు సంభవించిన అతిపెద్ద కార్చిచ్చు ఘటనల్లో ఐదోది కావడం గమనార్హం. ఈ కార్చిచ్చు దెబ్బకు ఆమరిల్లో పట్టణంలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న అమెరికా అణ్వాయుధాల కేంద్రంలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేసినట్లు ప్యాన్‌టెక్స్ సంస్థ వెల్లడించింది. జాతీయ రహదారుల వెంట చెట్లకు సైతం మంటలు అంటుకోవడంతో ఆయా హైవేలపై వాహనాల రాకపోకలను నిలిపేశారు.
ఓక్లహామా రాష్ట్ర సరిహద్దుల్లోని హెమ్‌ఫిల్, హచిన్‌సన్ కౌంటీల్లోనూ కార్చిచ్చు వ్యాపించింది. మియామీ, కనాడియన్ పట్టణాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సెనేటర్ కెవిన్ స్పార్క్స్ స్థానికులకు విజ్ఞప్తిచేశారు. కనాడియన్ పట్టణాన్ని కార్చిచ్చు దాదాపు చుట్టేసింది. స్కెలీటౌన్, వీలర్, అలీసన్, బ్రిస్కో పట్టణాల నుంచీ స్థానికులు వేరే చోట్లకు వెళ్లిపోయారు. కార్చిచ్చు ఘటనల కారణంగా టెక్సాస్ రాష్ట్రంలో మొత్తంగా కోటి 10 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్లుగా అమెరికాను కార్చిచ్చులు నిత్యం వణికిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment