రైతు ఆత్మహత్యలకు వారే కారణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలకు కాంగ్రెస్, టీడీపీలే కారణం. 60 ఏళ్లుగా ఆ పార్టీల రైతు వ్యతిరేక విధానాల వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రైతులను పిట్టల్లా కాల్చి చంపిన టీడీపీకి రైతు ఆత్మహత్యలపై మాట్లాడే అర్హత లేదు. బండ్లపై అసెంబ్లీకి కాకుండా బషీర్‌బాగ్‌కు వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలు అమరులకు నివాళులర్పించి తప్పు ఒప్పుకోవాలి
- గువ్వల, జీవన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం
ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైంది. రైతు ఆత్మహత్యలు, కరువు, ప్రబలుతున్న వ్యాధుల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫీజురీయింబర్స్‌మెంట్, దళితులకు భూపంపిణీ పథకాలు అమలు కావడం లేదు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నందున కనీసం 15 రోజులు అసెంబ్లీని నిర్వహించాలి.
- పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే
కరువు మండలాలను ప్రకటించాలి
ఈ ఏడాది వర్షాలు సరిగా కురవక రాష్ట్రంలో కరువు నెలకొంది. వెంటనే కరువు మండలాలను ప్రకటించాలి. ప్రజా సమస్యలపై చర్చకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. మమ్మల్ని సస్పెండ్ చేసి సభను ఏకపక్షంగా నడిపించాలని ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పెంచిన పరిహారాన్ని వెంటనే అందజేయాలి.
- వివేకానంద, టీడీపీ ఎమ్మెల్యే
చర్చించేందుకు ప్రతిపక్షాలకు దమ్ములేదు
ప్రతిపక్షాలకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే మేం సమాధానం చెబుతాం. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి గత ప్రభుత్వాల విధానాలే కారణం. దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.
- కర్నె ప్రభాకర్, సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు
ప్రజలు అసంతృప్తితో ఉన్నారు
ప్రభుత్వ పనితీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. విద్యావ్యవస్థ దారుణంగా తయారైంది. యూనివర్సిటీల్లో వీసీలు లేరు. పాఠశాలలు ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పిల్లలకు పుస్తకాలు లేవు. విశ్వ నగరం చేస్తామంటున్న హైదరాబాద్‌లో పది చినుకులు పడితే చాలు రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఇంత అధ్వానమైన పాలన ఎప్పుడూ చూడలేదు.
- చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, బీజేపీ ఎమ్మెల్యేలు
సంక్షోభంలో వ్యవసాయం
సకాలంలో వర్షాల్లేక వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వ వైఖరి వల్ల రైతులు ఆత్మహత్యల కు పాల్పడుతున్నారు. పంట నష్టానికి ఒక్క పైసా కూడా అం దజేయలేదు. రుణ మాఫీ చేయకుండా బ్యాంకులు రైతుల నడ్డి విరుస్తున్నాయి. గతేడాది జూన్ 2 నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పెంచిన పరిహారాన్ని అందజేయాలి.
- జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే
బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలి
బీసీ, మైనారిటీ సబ్‌ప్లాన్‌ను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లుతున్నాయి. ఆ నిధులను ఎస్సీల అభివృద్ధికి సత్వరమే ఖర్చు చేయాలి. వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. దీనిపై ప్రభుత్వం వెంటనే తగిన కార్యచరణను రూపొందించాలి.
- సున్నం రాజయ్య, సీపీఎం ఎమ్మెల్యే
మోదీ ప్రధానికి తక్కువ.. మంత్రికి ఎక్కువ
ఆయన ప్రధానికి తక్కువ.. విదేశాంగ మంత్రికి ఎక్కువ. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి మాట తప్పిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత లేదు. పోలవ రాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రభుత్వం ప్రతిపక్షాల మాట కూడా వినాలి. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అయితే రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించాలి.
- కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి
సమస్యలపై విస్తృత చర్చ జరగాలి
రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి. ముఖ్యంగా కరువు కారణంగా అప్పుల భారం పెరిగి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దళితులకు మూడెకరాల భూపంపిణీ, ఎస్సీ, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ల అమలు, పెండింగ్‌లోని ప్రాజెక్టులు వంటి అంశాలపై విస్తృత చర్చ జరగాలి. ఇందుకోసం కనీసం 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి.
- రవీంద్రకుమార్, సీపీఐ ఎమ్మెల్యే
చర్చలు పూర్తయ్యే వరకు కొనసాగించాలి
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోగా అన్ని సమస్యలపై చర్చ జరగాలి. లేదంటే సభా సమయాన్ని పొడిగించాలి. లక్ష ఉద్యోగాలని ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఎవరికీ రాలేదు. రైతు సమస్యలు, విష జ్వరాలు, నిరుద్యోగం, రెండు గదుల ఇళ్ల నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులు వంటి ఎనోన సమస్యలున్నాయి. వీటన్నింటిపై చర్చ జరపాలి.
- కె.లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యే
అసెంబ్లీ మీడియా పాయింట్
Published Thu, Sep 24 2015 2:06 AM | Last Updated on Tue, Oct 9 2018 6:36 PM
Advertisement
Advertisement