పక్కదారి పట్టించడమే ప్రభుత్వ దారి!
పట్టిసీమపై చర్చలో విపక్షం గొంతునొక్కిన అధికారపక్షం
- మాట్లాడమని ప్రతిపక్ష నేతకు మైకు ఇచ్చినట్టే ఇచ్చి.. వెంటనే కట్
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో విపక్షం వాణి వినిపించకుండా చేయడంలో ఆరితేరిన పాలకపక్ష తెలుగుదేశం పార్టీ.. మంగళవారం పట్టిసీమ ఎత్తిపోతలపై చర్చను పక్కదోవ పట్టించడానికి శతవిధాలా ప్రయత్నించింది. హఠాత్తుగా తెరపైకి వచ్చిన పట్టిసీమ ఎత్తిపోతల వెనకున్న అసలు కథ ప్రజలకు తెలియకుండా ప్రతిపక్షం గొంతు నొక్కింది.
తాము చేసే పనులను ప్రశ్నించడానికి వీలు లేదని తేల్చిచెప్పింది. ప్రశ్నించేవారిపై టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి మాటల దాడి చేశారు. వివరణ అడిగిందే పాపంగా తిట్లు, శాపనార్థాలతో రభస రగిలేలా చేసిన అధికారపక్షం.. చర్చ జరక్కుండానే సభ వాయిదా పడేలా చేసింది. అంగన్‌వాడీ సిబ్బంది సమస్యపై మంగళవారం ఉదయం వరుసగా మూడుసార్లు వాయిదా పడిన సభ తిరిగి ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రారంభమైంది.344వ నిబంధన కింద పట్టిసీమ ఎత్తిపోతలపై సోమవారం అర్ధంతరంగా ముగిసిన చర్చను ప్రారంభించాల్సిందిగా వైఎస్సార్ సీపీ సభ్యుడు వై.విశ్వేశ్వర్‌రెడ్డిని స్పీకర్ కోరారు.
కొంచెంసేపు సజావుగా సాగిన చర్చలో పలువురు అధికార, ప్రతిపక్ష సభ్యులు ప్రసంగించిన తర్వాత విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. ఆయన వివరాలు చెబుతున్న సమయంలోనే తాను మాట్లాడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు లేచారు. ఒకట్రెండు నిమిషాలు విపక్షానికి, కొత్తగా వచ్చిన సభ్యులకు సత్ప్రర్తనను బోధించారు. తర్వాత పట్టిసీమపై మాట్లాడకుండా సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన ప్రధాన కథనాన్ని ప్రస్తావిస్తూ సభను పక్కదోవ పట్టించారు. ‘పోలవరానికి చంద్ర గ్రహణం’ అనే ఆ కథనం పూర్తిగా అసత్యం, దురాలోచనతో కూడుకుందని ధ్వజమెత్తారు.
పోలవరం ప్రాజెక్టు ఆగిపోవాలన్నదే సాక్షి పత్రిక యాజమాన్యం, జగన్‌మోహన్‌రెడ్డి ఉద్దేశమంటూ తన అక్కసు వెళ్లబోసుకున్నారు. ఆ కథనానికి జగన్ క్షమాపణ చెప్పి ప్రసంగాన్ని కొనసాగించాలని సంబంధం లేని అంశాన్ని సభ ముందుంచి గొడవకు తెరలేపారు. దీనిపై ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ.. ఇటువంటి కథనాలు మిగతా పేపర్లలో శతకోటి వచ్చాయని, పేపర్ల పని పేపర్లు చేసుకుంటాయని, మన పని మనం చేసుకుందామని అంటుండగానే మైక్ కట్ అయింది. ఇదే అదునుగా మంత్రులు, అధికార పక్షం ఎమ్మెల్యేలు గత కొద్దిరోజులుగా చేస్తున్నట్టుగానే విమర్శలు గుప్పించడం ప్రారంభించారు.
ఈ దశలో సభలో రభస జరిగింది. తమ నేతను మాట్లాడమని చెప్పి మైకు ఎందుకు కట్ చేశారని విపక్ష సభ్యులు స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. సభ మధ్యలోకి వచ్చి నినాదాలు చేశారు. పేపర్లలో కథనానికి పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ కోడెల, జగన్‌మోహన్‌రెడ్డికి మళ్లీ మైకు ఇచ్చారు. ఆ రెండు నిమిషాలు మాట్లాడారో లేదో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడతారంటూ జగన్‌కిచ్చిన మైక్‌ను మళ్లీ కట్ చేశారు. దీంతో రగిలిపోయిన విపక్షం స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. వారిని మరింత రెచ్చగొట్టేలా బాబు ప్రసంగించారు.
శివాలెత్తిన ముఖ్యమంత్రి: పోడియం వద్దకు వస్తున్న విపక్ష సభ్యులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు.. ‘‘ఎందుకధ్యక్షా.. భయపడతారు.. ఎక్కడికి పోతారు.. ఎక్కడికొస్తారు.. ఏం చేస్తారంటున్నా.. ఊరికూరికే ఎగిరెగిరి పడతారెందుకంటున్నా.. ఏం చేస్తారంటున్నా.. హౌసయ్యా ఇదీ. మీ ఊరు కాదు’’ అంటూ మండిపడ్డారు. ‘‘మీరు (పాలకపక్ష సభ్యుల్ని) ఇక్కడే ఉండండి. రౌడీయిజం ఎవ్వరూ చేయలేరు. ఏమీ చేయలేరిక్కడ.. మీ తండ్రివల్లే కాలేదు ఇక్కడ. నీ వెంత?’’ అంటూ శివాలెత్తారు. ‘‘దయచేసి ప్రతిపక్ష సభ్యులూ గుర్తుపెట్టుకోవాలి.
రౌడీయిజానికి ఇది వేదిక కాదు. మీరు క్రియేట్ చేస్తానన్న అగ్లీ సీన్లు ఇక్కడ చూపిస్తున్నారు. హౌస్‌ను సక్రమంగా నిర్వహించడం అంటే మీ ఇష్టం వచ్చినట్టు నడపడం కాదు. ఎట్లా రన్ చేయాలో మాకు తెలుసు. మేము ఎన్నో విధాలా ప్రయత్నం చేసి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనుకున్నాం. దీనికి కేంద్రం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందంటే’’ అంటూ తన ప్రసంగాన్ని సీఎం కొనసాగించడానికి ప్రయత్నించారు. ఇంతలో స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన విపక్ష సభ్యులు.. సీఎం డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. దీంతో సీఎం చంద్రబాబు మరింత కోపంతో ఊగిపోయారు. ‘‘ఇది సభ్యత కాదు.. సభ్యతుంటే కూర్చోవాలి. వీళ్ల ఇష్టప్రకారం మాట్లాడలేరు.
ఇలా చేస్తే కనీసం మీరు ప్రజల్లోకి కూడా పోలేరు. పిచ్చిపిచ్చిగా చేస్తే.. మీ కథేంటో తేలుస్తా. వదిలిపెట్టను మిమ్మల్ని... పిచ్చి ఆటలు ఆడొద్దు. పోయి కూర్చోండి ముందుగా.. తమాషాలు ఆడుతున్నారు.. ఇది హౌసనుకున్నారా? మీ ఇల్లనుకున్నారా? మర్యాదగా చెబుతున్నాం. తమాషాలు ఆడొద్దండీ.. ఇది ఇడుపులపాయ కాదూ లోటస్ పాండూ కాదు. ఎందుకు అధ్యక్షా వీరికింత పిరికితనం.. డౌన్‌డౌన్ అనే అర్హత మీకు లేదు. మీకు పిచ్చి.. పిచ్చి పట్టింది. సిగ్గులేదు మీకు. అప్రజాస్వామికమంట.. అప్రజాస్వామికం... నన్ను అనే అర్హత మీకు లేదు. మీ తీరు ప్రజాస్వామ్యానికే అపహాస్యం.. సభా నాయకునిగా నాకు అన్ని అధికారాలున్నాయి. ఆ విషయం కూడా తెలియదు మీకు. సిగ్గు లేదు మీకు. మీరు మనుషులు కాదు’’ అంటూ బాబు తీవ్రఆగ్రహంతో ఊగిపోయారు. బాబు మాట్లాడుతుండగా.. విపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించారు.
సవాళ్లు విసిరిన మంత్రులు
క్షమాపణ చెప్పిన తర్వాతే జగన్ ప్రసంగిం చాలని మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిశోర్‌బాబు డిమాండ్ చేశారు. వీళ్లు మాట్లాడుతున్నంత సేపూ సభలో నినాదాల మోత మోగుతోంది.
మరోసారి జగన్‌కు మైకు ఇచ్చి కట్ చేశారు
ఈ దశలో ప్రతిపక్ష నేత జగన్‌ను మాట్లాడాల్సిందిగా స్పీకర్ ఆదేశించారు. జగన్ లేచి అధ్యక్షా అంటుండగానే ఆయన్ని అడ్డుకోవడమే ప్రధాన ఎజెండాగా వ్యూహాలు రచించిన చంద్రబాబు.. తాను మాట్లాడతానని మరోసారి లేచారు. జగన్‌కు ఇచ్చిన మైకు కట్ చేసి బాబుకు ఇవ్వడంతో సభలో విపక్షం మరోసారి భగ్గుమంది. అధికార, విపక్ష సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య స్పీకర్ సభను 12.52కి వాయిదా వేశారు. మధ్యాహ్నం ఒకటిన్నరకి ప్రారంభమైంది. తిరిగి గందరగోళం నెలకొనడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు.