'తెల్ల'బోయిన కాశ్మీర్, ముంచెత్తుతున్న మంచు
Published Wed, Mar 12 2014 6:02 PM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM
ఎడతెరిపి లేని హిమపాతం కాశ్మీర్ ని మృత్యువస్త్రంలా కప్పుకుంది. కొండల్లో కురిసిన హిమపాతం లోయల్లోకి దొర్లడంతో ఇద్దరు సైనికులు సహా పదిమంది హిమసమాధి అయిపోయారు. మరో వంద మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. దాదాపు 150 కట్టడాలు మంచు దెబ్బకి కుప్పకూలిపోయాయి.
గత కొద్దిరోజులుగా హిమపాతం కాశ్మీర్ ని అతలాకుతలం చేస్తోంది. మంచుతో రోడ్లన్నీ కప్పుకుపోయాయి. అటు విమాన ప్రయాణాలూ ఆగిపోయాయి.
హిమపాతం బరువుకి ఇళ్లు కూలిపోతున్నాయి. కొండ చరియలపై జీవిస్తూ మేకలను మేపుకునే గుజ్జర్లు, బకర్వాల్ ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉత్తర కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో పరిస్థితి అత్యంత భీకరంగా ఉంది. బయటి ప్రపంచంతోనే కాదు, పొరుగూళ్లతోనూ సంబంధాలు తెగిపోయాయి. భూతల స్వర్గం లాంటి కాశ్మీర్ భూలోక నరకంగా మారింది.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ట్విట్టర్ ద్వారా ప్రజలకు తెలియచేశారు.
Advertisement