బాబు పాలనపై వ్యతిరేకత పెరుగుతోంది | Babu is growing opposition on the regime | Sakshi
Sakshi News home page

బాబు పాలనపై వ్యతిరేకత పెరుగుతోంది

Published Sat, Dec 26 2015 12:48 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

బాబు పాలనపై వ్యతిరేకత పెరుగుతోంది - Sakshi

బాబు పాలనపై వ్యతిరేకత పెరుగుతోంది

♦ ఖమ్మం జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లతో వైఎస్ జగన్
♦ వైఎస్సార్‌సీపీ మరింతగా బలం పుంజుకుంటోంది  
♦ ఏపీ, తెలంగాణాల్లో మనమే జెండా ఎగరేస్తాం...
 
 సాక్షి, కడప:  ‘ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు తీరును ప్రజలు ఈసడించుకుంటున్నారు.. ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు.. చిన్నారుల నుండి పండుటాకుల వరకు ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.. రోజు రోజుకూ చంద్రబాబుపై అసంతృప్తి పెరిగిపోయి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది’అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం వైఎస్‌ఆర్ జిల్లా ఇడుపులపాయలోని అతిథి గృహం వద్ద తెలంగాణ  రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు వైఎస్ జగన్‌ను కలిశారు.

ఈ సందర్భంగా ఆయన వారినుద్దేశించి మాట్లాడారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ వాళ్లంతా ఒకే తాటిపై నిలబడినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో ఇదే కసితో పని చేయాలని, పార్టీ తరఫున తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఖమ్మంలో వైఎస్సార్‌సీపీ ఇదివరకటి కంటే ఇపుడు మరింత బలంగా కనిపిస్తోందన్నారు. టీడీపీ భవిష్యత్‌లో అడ్రస్ లేకుండా పోతుందని చెప్పారు.

టీఆర్‌ఎస్ కూడా ఖమ్మంలో బలంగా లేదని, కేవలం నాలుగు ఎంపీటీసీ స్థానాలు మాత్రమే గెలుచుకుందన్నారు. కాకపోతే టీఆర్‌ఎస్ ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులను కొనుక్కోవడమో.. తెచ్చుకోవడమో చేస్తోందని ఆయన విమర్శించారు. ఖమ్మంలో ఎంత మంది ఎన్ని ప్రలోభాలు పెట్టినా.. ఎంపీటీసీ సభ్యుడు మొదలు.. ఎంపీ వరకు అందరూ నిజాయితీగా వ్యవహరించడం అభినందనీయం అన్నారు. ఖమ్మంలోనే కాకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ  అంతటా పాగా వేస్తామని వైఎస్ జగన్ వివరించారు.  

 మనం పుంజుకుంటున్నాం...
 ‘ఒక్కటైతే మీకు చెప్పాలి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది.. చంద్రబాబు పరిపాలనపై ప్రజలల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది.. ఒక పక్క టీడీపీ బలహీనపడుతోంటే.. మరో పక్క ైవైఎస్సార్ కాంగ్రెస్ బలం పుంజు కుంటోంది.. రానున్న కాలంలో అధికారంలోకి వచ్చేది మన పార్టీనే.. ఏపీలో అధికారంలోకి వచ్చాక.. అదే గాలితో తెలంగాణాలో కూడా పుంజుకుంటాం.. రెండు రాష్ట్రాల్లో జెండా ఎగరేస్తాం.. కష్టమైనా, నష్టమైనా వెనుకడుగు వేయకుండా నిలబడిన ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటాను.

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి లింగాల కమల్‌రాజును గెలిపించుకునేందుకు అందరూ కృషి చేయాలి’ అని జగన్ పిలుపునిచ్చారు. అంతకు ముందు వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులను వైఎస్ జగన్‌కు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఖమ్మం జిల్లా పినబాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement