దిక్కులేకనే పార్టీలో ఉంటున్నాం!
ఆత్మరక్షణలో టీ టీడీపీ!
♦ ‘చేరిక’లపై చంద్రబాబు తీరుతో నేతల అయోమయం
♦ ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా మాట్లాడితే ఎలాగనే ప్రశ్న
♦ అధికార పక్షాన్ని ఎలా ఇరుకున పెట్టగలుగుతామంటున్న నేతలు
♦ భారీ వలసలతో చిక్కిశల్యం.. తల పట్టుకుంటున్న జిల్లాల నాయకులు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తీరుతో ఆ పార్టీ తెలంగాణ నాయకుల గొంతులో పచ్చివెలక్కాయ పడింది. ఇప్పుడు వారి పరిస్థితి కక్కలేక, మింగలేక అన్నట్లు తయారైంది. పార్టీ ఫిరాయింపులపై చంద్రబాబు తీరు ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా ఉండడాన్ని ఇక్కడి నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇన్నాళ్లూ టీటీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలస వెళ్లిన వారిపై దుమ్మెత్తి పోసిన నాయకత్వం... వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ వద్ద పోరాటం చేసింది.
కానీ అదే పార్టీ అధికారంలో ఉన్న ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీని చంద్రబాబు తమ పార్టీలో చేర్చుకున్నారు. వారికి ఆయనే స్వయంగా పచ్చ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరెవరితో రాజీనామాలు చేయించకుండానే పార్టీలో చేర్చుకున్నారు. తెలంగాణలో టీఆర్ ఎస్‌లో చేరిన తమ ఎమ్మెల్యేల విషయంలో అరిచి గగ్గోలుపెట్టిన చంద్రబాబు, ఏపీలో మాత్రం అదేమీ పట్టకుండా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు స్వాగతం పలకడాన్ని ప్రస్తావిస్తే... తెలంగాణ నాయకులు నీళ్లు నముతున్నారు. ‘‘ఎమ్మెల్యేలు పార్టీలు మార డంపై ఏది తప్పని తాము వాదించామో అదే తప్పు ఏపీలో జరిగింది. ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేల రాజీనామాలు డిమాండ్ చేసినప్పుడు... అక్కడ కూడా అదే వర్తించాలి. కానీ అలాంటిదేమీ లేదు. తెలంగాణలో టీఆర్‌ఎస్ వేసే ప్రశ్నలకు మా వద్ద సమాధానం లేకుండా పోయింది. ఇక అధికార పక్షాన్ని మేమెలా ఇరుకున పెట్టగలుగుతాం, ఎలా నిలదీయగలుగుతాం, వలస పోయిన ఎమ్మెల్యేల రాజీనామాలను ఎలా కోరగలుగుతాం..’’ అని టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.
దిక్కులేకనే పార్టీలో ఉంటున్నాం!
తెలంగాణ టీడీపీ నుంచి 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు మిగిలింది కేవలం ఐదుగురే. వారిలోనూ ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య టీడీపీకి దాదాపు దూరంగానే ఉంటున్నారు. మిగతా నలుగురిలోనూ ఒకరు టీఆర్‌ఎస్ నాయకత్వంతో టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. మరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తమకు అవసరం లేదన్న భావనలో టీఆర్‌ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వలసలు, తెలంగాణ టీడీపీపై పార్టీ అధినేత చంద్రబాబు పెద్దగా దృష్టిపెట్టకపోవడంతో జిల్లాల నేతల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికే ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడం, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సెలర్లు, సర్పంచులు వంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా టీడీపీ నుంచి వెళ్లిపోవడంతో జిల్లాల్లో పనిచేసే కేడర్ లేకుండా పోయింది. దీంతో ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయి, ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జులుగా మిగిలిన నేత లు తల పట్టుకుంటున్నారు.
‘‘మాకు ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. కింది స్థాయి కేడర్ అంతా వెళ్లిపోయింది. నాయకత్వం మా గురించి పట్టించుకోవడం ఎప్పుడో మానేసింది. మేం పార్టీ మారదామన్నా ప్రత్యామ్నాయం కూడా లేదు. దిక్కులేకనే టీడీపీలో కొనసాగుతున్నాం..’’ అని దక్షిణ తె లంగాణలోని ఓ జిల్లా స్థాయి నాయకుడు పేర్కొన్నారు. ఇలా ఎటూ వెళ్లడానికి అవకాశం లేని నేతలు పార్టీని పట్టుకుని ఉండాలన్నా అధినేత చంద్రబాబు ద్వంద్వ నీతి తమకు ఇబ్బందికరంగా మారిందని వాపోతున్నారు.