మంత్రి పదవులు.. భారీ నజరానాలు
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై ఆశల వల
♦ అందుకే మంత్రివర్గ విస్తరణ వాయిదా
♦ ఆపరేషన్ ఆకర్ష్‌పై టీడీపీ ఎమ్మెల్యేల్లో చర్చ
♦ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే...
♦ చంద్రబాబు వైఖరి పార్టీలో ముసలం పుట్టించేలా ఉంది
♦ అధికార పార్టీ నేతల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ఆకర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ నజరానాలు, మంత్రి పదవులను ఎర వేస్తున్నారని అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం తమ పార్టీ, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని, వారి దృష్టిని మళ్లించడానికే సీఎం ఈ రాజకీయ ఎత్తుగడను ఎంచుకున్నారని విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో సీఎంతోపాటు కొందరు మంత్రులు అంతర్గతంగా చర్చలు సాగిస్తున్నట్లు వస్తున్న వార్తలు సోమవారం అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యేల్లో చర్చనీయాంశంగా మారాయి. ‘‘ఇంతకు ముందు మా నాయకుడు వైఎస్సార్‌సీపీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకున్నారు. ఇప్పుడు మరికొంత మందిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగానే ఆయా జిల్లాల మంత్రులు, సీనియర్ నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో చర్చించి వారి డిమాండ్లను నెరవేర్చాలని సీఎం చంద్రబాబు ఆయా నేతలను ఆదేశించారు. అందులో భాగంగానే వైఎస్సార్‌సీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలతో ఆదివారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుచర్చించారు. చంద్రబాబు కూడా వారితో ఫోన్‌లో మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకొనేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో ఒకరికి మంత్రి పదవి కూడా ఇస్తామని మా పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది’’ అని అధికార పార్టీ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు.
తిరుగుబాటు తప్పదు
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడం ద్వారా ప్రజల దృష్టిని ప్రభుత్వ వైఫల్యాలపై నుంచి రాజకీయాంశాలపైకి మళ్లించేలా చ ంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ ఆకర్శ్ పథకాన్ని తెరపైకి తెచ్చారని టీడీపీ ఎమ్మెల్యేలు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ ఆకర్శ్ వికటించి టీడీపీ కొంప కొల్లేరయ్యే పరిస్థితి వచ్చేలా ఉందని ఆ పార్టీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటే ఎప్పటి నుంచో టీడీపీలో కొనసాగుతున్న నేతల నుంచి తిరుగుబాటు తప్పదని, అది ఎప్పుడనేది త్వరలోనే తె లుస్తుందని టీడీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు కూడా ప్రలోభాల ఎర చూపుతున్నట్లు సమాచారం. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిబంధనల ప్రకారం స్పీకర్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, కానీ ప్రస్తుతం అలా చర్యలు తీసుకొనే పరిస్థితి లేదని టీడీపీ ఎమ్మెల్యేలు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఆశ చూపి, ఉచ్చులోకి లాగడానికే మంత్రివర్గ విస్తరణను చంద్రబాబు వాయిదా వేస్తున్నారని వారు తెలిపారు.
జ్యోతుల నెహ్రూకు నీటి పారుదల శాఖ!
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో తమ పార్టీ నేతలు చర్చించారని, ఆయనను టీడీపీలో చేర్చుకోవడం ఖాయమైందని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ఆయన సోమవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే మీరు నిర్వహిస్తున్న హోం మంత్రి పదవే ఇస్తారేమో కదా? అని విలేకరులు ప్రశ్నించగా... తన పదవిని జ్యోతుల నెహ్రూకు ఇవ్వరని చినరాజప్ప పేర్కొన్నారు. నెహ్రూ నీటి పారుదల శాఖను కోరుకుంటున్నారని, అది ఇస్తారేమోనని అన్నారు. జ్యోతుల నెహ్రూను టీడీపీలో చేర్చుకొని మంత్రి పదవి ఇస్తే.. తూర్పు గోదావరి జిల్లాలోని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఎలా అంగీకరిస్తారని కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. తమను కాదని, వేరే పార్టీనుంచి ఎమ్మెల్యేలను రప్పించి పదవులు ఇస్తే పార్టీలోని ఎమ్మెల్యేలు ఊరుకోరని స్పష్టం చేశారు. దీనివల్ల పార్టీలో అసంతృప్తి రేగే ప్రమాదం ఉంటుందన్నారు.
ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?
తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్చుకొని మంత్రి పదవి ఇస్తే చంద్రబాబు విమర్శలు చేశారని, ఇప్పుడు ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను చేర్చుకొని మంత్రి పదవులు ఇస్తే ప్రజలకు ఏం సమాధానం చెబుతారని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో తప్పని చెప్పి, ఇక్కడ అదేపని చేస్తే పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. పార్టీలో చేరిన వారికి మంత్రి పదవులు అంటూ చంద్రబాబు ఊరిస్తున్నారే తప్ప అలా చేస్తారనుకోవడం లేదని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు. పార్టీలో చేరిన తర్వాత వారికి మొండిచేయి చూపుతారని వివరించారు. హామీలు ఇవ్వడం, తరువాత వాటిని విస్మరించడం చంద్రబాబుకు అలవాటేనని గుర్తుచేశారు. ప్రభుత్వ విప్ ఒకరు మాట్లాడుతూ... మంత్రి పదవులు ఇస్తారో ఇవ్వరో తరువాత విషయం, ముందు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను చేర్చుకొని ఆ పార్టీ ప్రభావాన్ని, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను తగ్గించడమే మా నేత అభిమతం అని పేర్కొన్నారు.