బాధ్యత మరిచి విమర్శలా?
♦ పత్తి విషయంలో రాష్ట్ర సర్కారు తీరుపై దత్తాత్రేయ ఆగ్రహం
♦ రాజకీయ దురుద్దేశంతో మాట్లాడుతున్నారని మండిపాటు
♦ రైతులకు గుర్తింపు కార్డులు ఎందుకు ఇవ్వలేదు?
♦ సీసీఐ నిబంధనలపై ఎందుకు అవగాహన కల్పించలేదు?
♦ కరువు మండలాలను ఎందుకు ప్రకటించలేదు?
సాక్షి, న్యూఢిల్లీ: పత్తి రైతుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించిందని, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై విమర్శలు చేస్తోందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ దుయ్యబట్టారు. సీసీఐ నిబంధనలపై రాష్ట్ర సర్కారు రైతులకు సరిగా అవగాహన కల్పించడం లేదని విమర్శించారు. కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ సలహాదారు శ్రీరాం వెదిరెతో కలిసి శుక్రవారమిక్కడ దత్తాత్రేయ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘కేంద్రం తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్య చేశారు. సీసీఐ కొనుగోళ్లు ఎక్కువగా జరగడం లేదని ప్రకటన చేశారు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసింది’’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘నేను స్వయంగా రెండుసార్లు సీసీఐ అధికారులతో సమీక్ష జరిపా. జౌళిశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ హైదరాబాద్ వచ్చి అన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. పత్తి కనీస మద్దతు ధర రూ.4,100 నుంచి రూ.5,000కు పెంచాలి.. తేమ శాతం పరిమితిని 12 నుంచి 15 శాతానికి పెంచాలన్న డిమాండ్లు విధానపరమైనవి. దేశం మొత్తానికి వర్తించేవి’’ అని వివరించారు.
రైతులకు గుర్తింపు కార్డులేవీ?
‘‘సీజన్ ప్రారంభానికి ముందే సీసీఐ సీఎండీ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రులు హైదరాబాద్‌లో సమావేశమై మార్గదర్శకాలను తయారు చేసి తెలంగాణ ప్రభుత్వానికి పంపారు. దాని ప్రకారం ప్రభుత్వం రైతులందరికీ గుర్తింపు కార్డులు జారీచేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 95 శాతం మంది రైతులకు కార్డులు జారీ చేయలేదు’’ అని ద త్తాత్రేయ పేర్కొన్నారు. ‘‘పత్తిని మార్కెట్లోకి తేవడానికి ముందు రైతులకు అవగాహన కల్పించాలి. తేమ శాతం 8 నుంచి 12 మధ్య ఉంటే వెంటనే కొనుగోలు చేస్తామన్న మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ రెండు నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోలేదు. సీసీఐ రూ.4,100 చొప్పున కొనుగోలు చేసేందుకు రూ.10 వేల కోట్లు కేటాయించింది. నిధుల కొరత లేదు. కావాల్సినన్ని కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాఖ వైఫల్యాలు కప్పి పుచ్చుకోవడానికి కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారు’’ అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించాలని, ఆరిన పత్తిని మార్కెట్లోకి తెచ్చేలా చూడాలని సూచించారు.
ఆ రాష్ట్రాలు సీసీఐకి పోటీగా కొంటున్నాయి
గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు సీసీఐకి పోటీగా పత్తిని కొనుగోలు చేస్తున్నాయని దత్తాత్రేయ పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో దాదాపు వెయ్యికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గుజరాత్‌లో రైతుల సహకార సంఘాలు కొనుగోలు చేస్తున్నాయి. తెలంగాణలో కూడా మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి. అంతేగానీ కేంద్రంపై ఆరోపణలు చేస్తే ఎలా? ఛత్తీస్‌గఢ్ వరికి కనీస మద్ధతు ధరపై రూ.50 బోనస్ ఇస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విధానాలు అనుసరించాలి. పత్తి గింజల ద్వారా నూనె తీసే ఫ్యాక్టరీలు కూడా గుజరాత్‌లో ఉన్నాయి. వీటి కారణంగా పత్తికి ఎంఎస్‌పీ కంటే ఎక్కువ గిట్టుబాటు లభిస్తోంది. ఇలాంటి వాటికి మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుంటే కేంద్రం నిధులు ఇచ్చి ఆదుకుంటుంది’’ అని సూచించారు. తెలంగాణలో అత్యధిక మండలాలు కరువుతో సతమతమవుతున్నా.. కేంద్ర బృందాలు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కరువు మండలాలను ప్రకటించలేదని ప్రశ్నించారు. కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే రూ.1,500 కోట్ల కరువు నిధులు తీసుకెళ్లిందని చెప్పారు.
దేవాదులకు నీళ్లు రాకుండా చేస్తున్నారు
‘‘4.5 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా దేవాదుల ప్రాజెక్టుకు వైఎస్ హయాంలో రూపకల్పన చేశారు. కానీ ఇప్పుడు దీన్ని 20 వేల ఎకరాలకు పరిమితం చేశారు. కొత్తగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించే ప్రాజెక్టులవల్ల దేవాదులకు వచ్చే నీళ్లు రాకుండా చేస్తున్నారు. ఇది వరంగల్ జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టినట్టు కాదా? ముఖ్యమైన నీటి పారుదల పథకాలు రూపకల్పన చేసినప్పుడు సీఎం అందరినీ విశ్వాసంలోకి తీసుకోవాలి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక కేంద్రం ఏఐబీపీ పథకం కింద దేవాదులకు రూ.63 కోట్లు ఇచ్చిం ది. ఇప్పుడు ఆ నిధులు వృథానే’’ అని దత్తాత్రేయ అన్నారు. వరంగల్ ఉపఎన్నికలో పోటీ టీఆర్‌ఎస్ బీజేపీ మధ్యే ఉందని చెప్పారు.