
బాత్‌రూమ్ సింగర్స్‌కు భలే చాన్స్!
మీరు బాత్‌రూమ్‌కు వెళ్లినప్పుడు.. ఏదో నాలుగు కూనిరాగాలు తీస్తారా? బాత్‌రూమ్‌లో పాడటం మీకు సరదానా?
మీరు బాత్‌రూమ్‌కు వెళ్లినప్పుడు.. ఏదో నాలుగు కూనిరాగాలు తీస్తారా? బాత్‌రూమ్‌లో పాడటం మీకు సరదానా? అయితే మీరు కూడా గాయకులు అయిపోవచ్చు! ఏదో చాటుమాటుగా నాలుగు కూనిరాగాలు తీసినంతమాత్రాన గాయకులైపోతారా? అనుకోకండి. మీలాంటి వాళ్ల ప్రతిభను బయటకుతీసి.. ప్రపంచానికి పరిచయం చేసేందుకే బెంగళూరు టెక్కీ సునీల్ కోశె ముందుకొచ్చారు. బాత్‌రూమ్ సింగర్‌కు భవిత ఉండదన్న అభిప్రాయాన్ని పటాపంచలు చేసి.. ఆయన చాలామందిని ప్రొఫెషనల్ గాయకులుగా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం ఆయన 'ఫ్రమ్ మగ్ టు మైక్' పేరిట ఓ గ్రూప్‌ను ఏర్పాటుచేశారు. ఈ గ్రూప్ ఆధ్వర్యంలో 200 వర్క్‌షాప్‌లు నిర్వహించి.. దాదాపు మూడువేలమంది గాయకులకు అవకాశం కల్పించారు. దీంతో వాళ్లంతా వేదికలు ఎక్కి ధైర్యంగా పాటలు పాడటమే కాదు.. చెన్నై, బెంగళూరు, కొచ్చి, త్రివేండ్రం మొదలైన నగరాల్లోని స్టూడియోల్లో తమ పాటను రికార్డు చేసుకొని మురిసిపోతున్నారు.
'సంప్రదాయ గానాన్ని, ప్రొఫెషనల్ సింగింగ్‌కు అనుసంధానం చేసి.. ఓ వేదిక కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాను. చాలామంది 20-25 ఏళ్ల పాటు శిక్షణ తీసుకున్నా.. వారికి స్టూడియోలో పాడే అవకాశం రావడం లేదు. స్టూడియోలో పాట రికార్డు చేస్తే తప్ప.. మీ సొంత గొంతును మీరు అర్థం చేసుకోలేరు. వేదిక మీద పాడటం వేరు. స్టూడియోలో మైక్రోఫోన్ ఎదుట పాడటం వేరు. గొంతులో చిన్న మార్పు వచ్చినా స్టూడియోలో అర్థమైపోతుంది' అని సునీల్ కోశే చెప్తారు. ఆయన తాజాగా తన విద్యార్థులతో కలిసి ఓ వీడియోను రూపొందించారు. బాత్‌రూమ్ గాయకులారా సిగ్గుపడకండి.. బయటకొచ్చి మీ ప్రతిభ చాటండి అని ఈ వీడియో ద్వారా ప్రోత్సహిస్తున్నారు.