బ్యాంకింగ్ రంగానికి 10వేల కోట్ల నష్టం
రాష్ట్రాన్ని విభజించేందుకు తాము సిద్ధమేనని కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పిన ఒక్క మాట విలువ ఎంతో తెలుసా... అక్షరాలా పదివేల కోట్లు!! అది కూడా కేవలం ఒక్క బ్యాంకింగ్ రంగంలోనే! తెలంగాణ ఏర్పాటుకు తాము సుముఖమేనంటూ కేంద్ర మంత్రి అజయ్ మాకెన్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ జూలై 30వ తేదీన ఢిల్లీలో ప్రకటించారు. తత్ఫలితంగా సీమాంధ్ర ప్రాంతం ఆగ్రహావేశాలతో రగిలిపోయింది. దాదాపు గడిచిన వారం రోజుల నుంచి అక్కడ ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. పాఠశాలలు, దుకాణాలు, బ్యాంకులు, చివకు ఆస్పత్రులు కూడా సరిగా పనిచేయడంలేదు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోవడం వల్ల ఆ రంగానికి దాదాపు పదివేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. ఏటీఎంలలో డబ్బులు పెట్టడానికి కూడా కుదరకపోవడంతో చాలా వరకు ఏటీఎంలు ఖాళీగానే ఉంటున్నాయి. దాదాపుగా బ్యాంకులన్నీ కలిసి ఈ పదమూడు జిల్లాల్లో మూడువేల ఏటీఎంలు, నాలుగువేల శాఖలు కలిగి ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు.
రాష్ట్రం మొత్తమ్మీద చూసుకుంటే ఆరువేల శాఖలలో 80 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో ఏటీఎం సేవలకు అంతరాయం కలిగిన మాట వాస్తవమేనని ఎస్బీఐ సీనియర్ అధికారి ఒకరు కూడా అంగీకరించారు. కొన్ని ప్రాంతాల్లో భద్రతాపరమైన కారణాల వల్ల ఏటీఎంలలో డబ్బులు పెట్టలేకపోతున్నామని, కానీ సాధ్యమైన చోటల్లా పెడుతున్నామని చెప్పారు. కొన్ని సందర్భాల్లో వినియోగదారుల సౌకర్యం కోసం తెల్లవారుజామునే డబ్బులు పెడుతున్నట్లు చెప్పారు.
చాలా నగరాల్లో ఉద్యోగులు తమ జీతం డబ్బులు తీసుకోడానికి ఏటీఎంలే ఆధారం కాబట్టి వాటివద్ద పొడవాటి క్యూలు ఉంటున్నాయి. అయితే, తమ బ్యాంకు శాఖలకు దగ్గరగా ఉండే ఏటీఎంలలో అయితే డబ్బులు ఉంటున్నాయని ఎస్బీఐ అధికారి తెలిపారు. రాష్ట్రంలోని సీమాంధ్ర జిల్లాల్లో స్టేట్ బ్యాంకుకు దాదాపు 1200 ఏటీఎంలు ఉన్నాయి. సగటున ఒక్కో ఏటీఎంలో 300 లావాదేవీలు జరుగుతాయని, సుమారుగా 6-7 లక్షల రూపాయల వరకు డ్రా చేసుకుంటారని అన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బ్యాంకింగ్ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు ఆయన చెప్పారు.