
మిత్రమా మోదీ.. నీ రాకకు ఎదురుచూస్తున్నాం!
ధాని మోదీని స్నేహితుడిగా సంబోధిస్తూ.. ఆయన చేపట్టనున్న పర్యటనను చరిత్రాత్మకంగా అభివర్ణిస్తూ..
న్యూఢిల్లీ: త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీని పురస్కరించుకొని ఆయనతో ఉన్న స్నేహబంధాన్ని చాటుతూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్వీట్ చేశారు. ప్రధాని మోదీని స్నేహితుడిగా సంబోధిస్తూ.. ఆయన చేపట్టనున్న ఇజ్రాయిల్ పర్యటనను చరిత్రాత్మకంగా ఆయన అభివర్ణించారు. ఆయన రాక కోసం ఇజ్రాయిల్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు.
యూదుల పండుగ పాస్‌ఓవర్‌ను పురస్కరించుకొని నెతన్యాహుకు ప్రధాని మోదీ మంగళవారం ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభాకాంక్షలపై స్పందిస్తూ.. ‘ పండుగ శుభాకాంక్షలు తెలిపినందుకు కృతజ్ఞతలు మిత్రమా.. మీ చరిత్మాత్మక పర్యటన కోసం ఇజ్రాయిల్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు’ అని నెతన్యాహు పీఎంవో ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ పేర్కొన్నారు.
1992లో భారత్-ఇజ్రాయిల్ మధ్య దౌత్యసంబంధాలు ఏర్పడిన తర్వాత ఆ దేశ పర్యటనకు వెళుతున్న తొలి భారత ప్రధానిగా నరేంద్రమోదీ నిలువబోతున్నారు. 2014 సెప్టెంబర్‌లో ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మోదీ ఇప్పటికే నెతన్యాహుతో భేటీ అయి చర్చించారు. గత దశాబ్దకాలంలో ఇరుదేశాల ప్రధానులు భేటీ కావడం ఇదే మొదటిసారి.