
బెట్టింగ్ రాయుళ్లు ‘ఆమె’ వైపే
అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ పెరుగుతోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ పెరుగుతోంది. ఇదే సమయంలో అధ్యక్షపీఠాన్ని దక్కించుకునేది ట్రంపా? లేక హిల్లరీనా? అంటూ బెట్టింగ్ లు కూడా ఊపందుకున్నాయి. అయితే, ఎక్కువమంది హిల్లరీనే అధ్యక్ష పదవికి ఎన్నికౌతారని విశ్వసిస్తున్నారట.
ఓ వైపు ప్రిడిక్షన్ మార్క్ ట్ 'ప్రిడిక్ట్ ఇట్' చేసిన సర్వేలో అధ్యక్షురాలిగా హిల్లరీ ఎన్నికయ్యే అవకాశాలు 13శాతం తగ్గిపోయాయని చెప్పినా.. బెట్టింగ్ రాయుళ్లు ఆమె వైపే చూస్తుండటం విశేషం. గత వారం 'ప్రిడిక్ట్ ఇట్' వెబ్ సైట్లో క్లింటన్ పై 81శాతం మంది విశ్వాసం ఉంచగా.. ప్రస్తుతం క్లింటన్ విజయంపై నమ్మకం ఉంచిన వారి శాతం 56కి పడిపోయింది. కాగా, అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికౌతారని గత వారం 22శాతం మంది విశ్వసించారు. ప్రస్తుతం ట్రంపే అధ్యక్షునిగా ఎన్నికౌతారని విశ్వసించే వారి శాతం 44కు పెరిగింది.
నార్త్ కరోలినాలో హిల్లరీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఫ్లోరిడాలో ట్రంప్ ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉందని సదరు వెబ్ సైట్ లో పేర్కొన్నారు. ఈ సైట్ ద్వారా బెట్టింగ్ రాయుళ్లు స్ధానికంగా జరిగే ఎన్నికల మీద కూడా బెట్ చేయొచ్చు. పోటీ చేస్తున్న అభ్యర్ధిపై ఎక్కువ మంది గెలుస్తారని నమ్మకం ఉంచితే ఆ షేర్లు మరింత ధర పలుకుతాయి. అదే ఓడిపోతారని భావిస్తే ఆ షేర్ల విలువ పడిపోతుంది.